- పని మనిషి చేతిలో విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య
- ప్రశాసన్ నగర్ లో కలకలం రేకెత్తించిన ఘటన
- హంతకుల కోసం నేపాల్ వెళ్ళిన పోలీసు బృందం
హైదరాబాద్, మహా : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో ఏడెనిమిది నెలల పాటు కల్పన, ఆమె గ్యాంగ్ ఎదురుచూసినట్లు తెలుస్తోంది. ఇంటి ముందు నుంచి వస్తే సీసీటీవీ ఫుటేజీకి చిక్కుతామని భావించి, వెనుక నుంచి వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారు. కల్పనతో సహా మొత్తం ముగ్గురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత పారిపోయే క్రమంలో ఒక నిందితుడి క్యాప్ కిందపడటంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. సునంద భర్త వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. సునంద ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన కల్పన, ఈ విషయాన్ని తన గ్యాంగుకు చేరవేసి వారిని రప్పించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ హత్య జరిగింది. కల్పన నేపాల్‌కు చెందిన మహిళ. డబ్బులు, బంగారం చోరీ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రాత్రి రెండు గంటల సమయంలో హత్య జరిగిందని తెలిపారు. నేపాలీ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. కొన్ని ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సజ్జనార్ అన్నారు. నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేశారని వెల్లడించారు. బంగారం, నగలు ఎత్తుకుపోయారా లేదా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. వెనుక గేటు నుంచి వచ్చి హత్య చేసినట్లు చెప్పారు. కాగా, ఘటనా స్థలాన్ని డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్ పరిశీలించారు.
కొద్ది నెలల క్రితం నేపాలీకి చెందిన ఓ మహిళ విశ్రాంత ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ కుటుంబాన్ని కలిసింది .పని మనిషిగా చేరి మరో ముగ్గురు నేపాలీ ముఠాతో కల్సి ఈ హత్యకు పాల్పడింది. జూబిలీహిల్స్ ప్రశాంత్ నగర్ కాలనీలో మూడు అంతస్తుల భవనంలో వినయ్ రంజన్ రాయ్ కుటుంబం ఉంటుంది . మొదటి అంతస్తులో విగత జీవిగా రంజాన్ రాయ్ భార్య ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చని పోయిన సునందా వయస్సు 55 ఏళ్ళు. పరారీలో ఉన్న పనిమనిషి కోసం గాలిస్తున్నారు. ఆధారాలకోసం ఫోరెన్సిక్ బృందాలు సేకరిస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు నేపాల్ వెళ్లాయి.








