Mahaa Daily Exclusive

  వరుసలు మరిచిన వలపు…..

Share

వరుసలు మరిచిన వలపు.
* అక్కాతమ్ముళ్ల ‘వింత’ పెళ్లి.
* పెద్దమ్మ కొడుకుతో మూడేళ్ల ప్రేమాయణం.
* పెద్దలను ఎదిరించి వివాహం.. పోలీసుల చెంతకు నూతన దంపతులు.
*కర్ణాటకలో విస్తుపోయే ఘటన.
హైదరాబాద్, మహా..
సాధారణంగా ప్రేమకు కులం, మతం అడ్డుకాదని అంటుంటారు.. కానీ ఇక్కడ ఏకంగా వరుసలే మరిచిపోయారు. వరుసకు అక్కాతమ్ముళ్లయ్యే ఇద్దరు వ్యక్తులు ప్రేమిచుకోవడమే కాకుండా, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవడం ఇప్పుడు కర్ణాటకలో పెను సంచలనంగా మారింది. బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలోని దేవానహళ్లికి చెందిన శశికళ అనే యువతి, హోసకోటలో నివసిస్తున్న తన పెద్దమ్మ కొడుకు (వరుసకు తమ్ముడు) ప్రవీణ్‌తో గత మూడేళ్లుగా ప్రేమలో ఉంది. బంధుత్వాల రీత్యా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల వరుస అయ్యే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం స్థానికంగా విస్మయానికి గురిచేస్తోంది.
వీరి ప్రేమ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శశికళ తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిని ప్రేమించడం పద్ధతి కాదని హితవు పలికారు. అంతేకాకుండా, ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించి, వివాహానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే, తన మనసులో ప్రవీణ్‌కు తప్ప మరెవరికీ స్థానం లేదని భావించిన శశికళ, పక్కా పథకం ప్రకారం ఇంట్లో నుంచి పారిపోయింది. తన ప్రియుడు ప్రవీణ్‌ను కలిసి రహస్యంగా వివాహం చేసుకుంది. సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్ల కంటే తమ ప్రేమే గొప్పదని భావించిన ఈ జంట, గుడిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి అనంతరం తమకు ప్రాణహాని ఉందని గ్రహించిన ఈ నూతన దంపతులు నేరుగా దేవానహళ్లి పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిదండ్రులు మరియు బంధువుల నుంచి తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. బంధుత్వాల ప్రకారం వీరు అక్కాతమ్ముళ్ల వరుస అవుతారని తెలిసి పోలీసులు కూడా మొదట విస్తుపోయారు. అయినప్పటికీ, ఇద్దరూ మేజర్లు కావడంతో చట్టపరంగా వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయాలను గౌరవించే సమాజంలో ఇలాంటి ‘వరుసలు లేని’ వివాహం జరగడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.