ఫేక్ న్యూస్‌లో దేశంలోనే ఏపీ నంబర్ వన్.
* మానవ అక్రమ రవాణాలోనూ మూడో స్థానం.
*సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రవాహం.
* ఏపీలో 203 కేసులు.. తెలంగాణలో 139 నమోదు.
* ఎన్సీఆర్బీ నివేదికలో విస్తుపోయే గణాంకాలు.
అమరావతి, మహా.
దేశవ్యాప్తంగా నేరాల సరళిని విశ్లేషిస్తూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఆందోళనకరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలు (ఫేక్ న్యూస్) నమోదులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న ఫేక్ న్యూస్ కట్టడిలో రాష్ట్రం విఫలమవుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 ఏడాదిలో ఒక్క ఏపీలోనే ఏకంగా 203 ఫేక్ న్యూస్ కేసులు నమోదు కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 139 కేసులు నమోదయ్యాయి. రాజకీయ పక్షాల మధ్య సాగుతున్న సోషల్ మీడియా యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యక్తిత్వ హననం ఈ స్థాయి నేరాలకు ప్రధాన కారణమని నివేదిక విశ్లేషించింది.
మరోవైపు, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా ఏపీపై తమ పంజా విసురుతున్నారు. గతేడదితో పోలిస్తే రాష్ట్రంలో సైబర్ నేరాలు 8 శాతం మేర పెరగడం గమనార్హం. 2024 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2,528 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా వేధింపులు ఈ కేసుల్లో ప్రధానంగా ఉన్నాయి. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో సామాన్యులు సైబర్ కిరాతకుల బారిన పడుతున్నారని, దీనిపై కఠినమైన నిఘా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం నేరాల సంఖ్యను పరిశీలిస్తే, 2024లో ఏపీలో రికార్డు స్థాయిలో 1,16,076 కేసులు నమోదయ్యాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ఇది భారీ సంఖ్య అని ఎన్సీఆర్బీ పేర్కొంది.
రాష్ట్రంలో హింసాత్మక నేరాల పెరుగుదల కూడా ఆందోళన కలిగిస్తోంది. హత్యలు, హత్యాయత్నాలు, ఘర్షణల వంటి హింసాత్మక ఘటనలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రతిష్టకు మచ్చగా మారింది. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా అరికట్టడంలో వ్యవస్థాగత లోపాలు ఉన్నాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. మొత్తం మీద ఎన్సీఆర్బీ విడుదల చేసిన ఈ నివేదిక రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పెరుగుతున్న ఈ నేరాల గ్రాఫ్‌ను అడ్డుకోవడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.








