- బీఆర్ఎస్ కేడర్ పై బీజేపీ ఫోకస్
- మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు పదును
- నియోజకవర్గ స్థాయి నేతలే టార్గెట్
- 2028 ఎన్నికలే టార్గెట్ గా వ్యూహం
హైదరాబాద్, మహా : మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాలను కైవసం చేసుకుని, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్న కమలదళం, ఇప్పుడు మిషన్ 2028 లక్ష్యంగా పావులు కదుపాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే కాకుండా, బీఆర్ఎస్‌ను మూడో స్థానానికి పరిమితం చేసేలా బీజేపీ అగ్రనాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. పదేళ్లపాటు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతుండగా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ విఫలమైంది. కానీ ఇప్పుడు రూటు మార్చాలనుకుంటున్న పార్టీ ముందుగా నియోజకవర్గస్థాయి నేతలే టార్గెట్ గా వ్యూహాలను సిద్దం చేస్తోంది. బీజేపీకి నేతలున్నా కొన్ని నియోజకవర్గాలలో పార్టీ కేడర్ అంతగా బలం లేదు. మరికొన్ని చోట్ల కేడర్ ఉన్నా వారిని సమన్యయం చేసుకునే నేతలు కరువయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, బలమైన కేడర్‌ను ఆకర్షించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ రాజకీయ ఉనికి ముగిసిందనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపడం ద్వారా, ఆ పార్టీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది.
బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్ , కేంద్ర మంత్రి బండి సంజయ్ భిన్నమైన వ్యూహాలతో పని చేస్తున్నారు. బీఆర్ఎస్ అంతర్గత పరిణామాలు తెలిసిన ఈటల, ఆ పార్టీలోని అసంతృప్త నేతలతో టచ్‌లో ఉంటూ ఆపరేషన్ ఆకర్ష్ ను పర్యవేక్షిస్తుండగా.. బండి సంజయ్ తనదైన శైలిలో హిందూత్వ ఎజెండా, యువతను ఆకట్టుకునేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. సంస్థాగతంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు నిలుపుకుంటూనే, బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో పార్టీని విస్తరించడమే వీరిద్దరి ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు క్రమంగా ద్వైపాక్షికంగా మారుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్న పోరు, ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రూపాంతరం చెందుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బలం, రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజాదరణను చూపిస్తూ.. భవిష్యత్తులో కాంగ్రెస్‌ను ఢీకొట్టే ఏకైక శక్తి బీజేపీయేనని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉనికిని క్రమంగా దెబ్బతీస్తూ, ఆ పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు.
గత కొన్నాళ్ళుగా బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణమాాలు బీఆర్ఎస్ ను వీడిన కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో గులాబీ కేడర్ చెల్లాచెదురవుతోంది. గతంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన ఓటర్లు ఇప్పుడు బీఆర్ఎస్ ను బలహీనంగా భావించి, కమలం వైపు చేరుతారని నమ్ముతున్నారు. 2028 నాటికి తెలంగాణలో అధికారం చేపట్టడం అసాధ్యం కాదని పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే అసాధ్యమనుకున్న టాస్క్ ను సుసాధ్యం చేసినపుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదన్నది బీజేపీ నేతల వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. పార్లమెంట్ ఫలితాల జోష్‌ను అలాగే కొనసాగించి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తేనే మిషన్ 2028 విజయవంతం అవుతుందన్నది బీజేపీ నేతల అభిప్రాయం. బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బతీసి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ ఎంతవరకు సఫలమవుతుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.








