Mahaa Daily Exclusive

  హస్తం పార్టీలో ‘పదవుల’ కుంపటి….

Share

హస్తం పార్టీలో ‘పదవుల’ కుంపటి.
* ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో అసమ్మతి సెగలు!
* రేణుకా చౌదరి వర్గం ఆవేదన.
* పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దకు పంచాయతీ!
* బెల్లంపల్లిలో ముదురుతున్న విభేదాలు.
* ఎమ్మెల్యే వినోద్ వైఖరిపై సీనియర్ల ఆగ్రహం!
* కాంగ్రెస్‌లో ముదురుతున్న అంతర్గత పోరు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఖమ్మం , మంచిర్యాల జిల్లాల్లో పార్టీ కోసం ఏళ్ల తరబడి శ్రమించిన ‘ఒరిజినల్’ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కలేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారంటూ సీనియర్ నాయకులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఫైర్ బ్రాండ్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అనుచరులు తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పదవుల పంపకంలో రేణుకా చౌదరి వర్గానికి ఒక్క పదవి కూడా దక్కకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వారంతా హైదరాబాద్‌కు తరలివచ్చి, తమ గోడును వెళ్లబోసుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తమను కాదని, అధికారంలోకి వచ్చాక చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే జి. వినోద్ వైఖరిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. గత ఎన్నికల్లో వినోద్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నాయకులను పక్కనపెట్టి, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎమ్మెల్యే వినోద్ ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగానే కాసిపేట మండలానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పార్టీ కోసం అందరం కలిసి పనిచేసినప్పుడు, పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం కేవలం ఒకే వర్గానికి (ఎమ్మెల్యే వర్గం) ఎలా కట్టబెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలతో పాటు, సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో రేగుతున్న ఈ అసమ్మతి సెగలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఈ అంశం పీసీసీ అధ్యక్షుడి దృష్టికి చేరగా, అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.