వరంగల్లో కాకతీయ ప్రాచీన శివాలయం ధ్వంసం.
* 800 ఏళ్ల నాటి చరిత్రపై దెబ్బ.
* బాధ్యులపై కేసు నమోదుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశం.
*న్యాయవాది రామారావు ఫిర్యాదుతో కదిలిన నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ.
హైదరాబాద్, మహా.
వరంగల్ జిల్లాలో సుమారు 800 ఏళ్ల నాటి ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం కావడంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. చారిత్రక సంపదను కాపాడటంలో జరిగిన నిర్లక్ష్యంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పురావస్తు విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ న్యాయవాది ఇమ్మనేని రామారావు నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీకి చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం దిల్లీ స్థాయికి చేరింది. ఆలయ ధ్వంసానికి సంబంధించిన వివరాలను, చారిత్రక ఆధారాలను పరిశీలించిన అథారిటీ, దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించి తక్షణ చర్యలకు ఆదేశించింది.
వాస్తవానికి ఈ ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు మరియు శాసనాలను 1965లోనే అప్పటి హెరిటేజ్ శాఖ అధికారికంగా నమోదు చేసింది. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడాన్ని ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని, ఇది సాంస్కృతిక వారసత్వాన్ని తుడిచిపెట్టడమేనని న్యాయవాది రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధ్యులైన వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, జరిగిన నష్టానికి వారిని జవాబుదారీలుగా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.








