తమిళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు.
* ఎన్డీయేకు అన్నాడీఎంకే గుడ్ బై.
* డీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైన పళనిస్వామి?.
*వివిజయ్ ‘టీవీకే’ ఎంట్రీతో ద్రావిడ పార్టీల్లో మొదలైన గుబులు.
* దశాబ్దాల బద్ధ శత్రువుల మధ్య అసాధారణ పొత్తు చర్చలు!
హైదరాబాద్, మహా.
దశాబ్దాలుగా ఉత్కంఠభరిత పరిణామాలకు వేదికైన తమిళనాడు రాజకీయాల్లో మరో ఊహించని సంచలనం నమోదు కాబోతోంది. జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలను సైతం ప్రభావితం చేసేలా ద్రావిడ గడ్డపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ప్రధాన పక్షమైన అన్నాడీఎంకే శాశ్వతంగా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఒంటెద్దు పోకడలు, ఆయన వ్యవహారశైలిపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరుకోవడంతో, కమలం పార్టీతో తెగతెంపులు చేసుకోవడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని మరో భారీ రాజకీయ భూకంపం చోటుచేసుకోబోతోంది. ఎన్డీయే కూటమికి దూరమవుతున్న అన్నాడీఎంకే.. ఏకంగా దశాబ్దాల బద్ధ శత్రువైన అధికార డీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎంజీఆర్, జయలలిత కాలం నుంచి కరుణానిధి కుటుంబంతో అన్నాడీఎంకేకు ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు-నిప్పులా ఉండే ఈ రెండు ప్రధాన ద్రావిడ పార్టీల మధ్య ఇప్పుడు అసాధారణ స్థాయిలో కూటమి చర్చలు జరుగుతుండటం తమిళ తంబిలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని అక్షరాలా నిజం చేస్తూ.. దశాబ్దాల ప్రత్యర్థులు ఇద్దరూ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
అసలు ఉప్పు-నిప్పు లాంటి ఈ రెండు పార్టీలు ఎందుకు కలుస్తున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణం కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ ప్రవేశమే అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. విజయ్ ఇటీవల స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి తమిళనాట అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతలో విజయ్ పార్టీకి విపరీతంగా పెరుగుతున్న ఆదరణ చూసి సాంప్రదాయ రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకుకు విజయ్ ఎక్కడ గండికొడతారోనన్న తీవ్ర ఆందోళన అటు స్టాలిన్, ఇటు పళనిస్వామి శిబిరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
విజయ్ రాకతో క్షేత్రస్థాయిలో సాంప్రదాయ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల చుట్టూనే తిరిగిన తమిళ రాజకీయ చక్రం.. ఇప్పుడు విజయ్ ఎదుగుదలతో కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఊహించని యువ కెరటాన్ని ఎదుర్కోవాలంటే, విడివిడిగా పోటీ చేయడం కన్నా బద్ధ శత్రువులమైనా సరే ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా ఆడ్డుకోవడమే ఏకైక మార్గమని ఈ రెండు ద్రావిడ పార్టీలు అంతర్గతంగా భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి విజయ్ ఎంట్రీతో తమిళనాడులో పుట్టుకొస్తున్న ఈ సరికొత్త రాజకీయ సమీకరణాలు.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.








