Mahaa Daily Exclusive

  తమిళనాట దళపతి మ్యాజిక్….

Share

తమిళనాట దళపతి మ్యాజిక్.
* ముఖ్యమంత్రిగా విజయ్ పక్కా!
* మ్యాజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే కూటమి.
* జై కొట్టిన కాంగ్రెస్, వామపక్షాలు.
*118 స్థానాల బలంతో గవర్నర్‌తో టీవీకే చీఫ్ భేటీ.
* కొలిక్కి వచ్చిన తమిళ రాజకీయాలు!
హైదరాబాద్, మహా.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్, రాజకీయ పండితుల అంచనాలను మించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాట నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను విజయవంతంగా సాధించింది. తాజా రాజకీయ సమీకరణాలతో దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఇక లాంఛనమేనని స్పష్టమైంది.
ఎన్నికల బరిలో సత్తా చాటిన విజయ్‌కు అనూహ్యంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునే క్రమంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ టీవీకేకు జై కొట్టగా, వామపక్షాలు సైతం తమ పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించాయి. వీటికి తోడు తమిళనాట కీలకమైన వీసీకే (విడుతలై చిరుతైగళ్ కట్చి) పార్టీ కూడా విజయ్‌ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని సపోర్ట్ చేయడంతో టీవీకే కూటమి బలం అమాంతం పెరిగిపోయింది. ఈ అనూహ్య పరిణామాలతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రధాన ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గట్టి బ్రేక్ పడినట్లయింది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను టీవీకే కూటమి సునాయాసంగా సాధించింది. తాజా లెక్కల ప్రకారం దళపతి విజయ్ నేతృత్వంలోని కూటమి మొత్తం 118 సీట్ల బలాన్ని కూడగట్టుకుంది. ఇందులో టీవీకే సొంతంగా ఏకంగా 107 స్థానాల్లో సత్తా చాటి అతిపెద్ద పార్టీగా అవతరించగా.. మద్దతు తెలిపిన పార్టీలైన కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 స్థానాలతో తమ వంతు బలాన్ని అందించాయి. ఈ మొత్తం సంఖ్య 118కి చేరడంతో విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి మార్గం పూర్తిగా సుగమమైంది.
తగినంత బలం సమకూరడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే అధినేత విజయ్ తన అడుగులు వేగవంతం చేశారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖతో ఆయన రాష్ట్ర గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తమ కూటమికి తగినంత సంఖ్యాబలం ఉన్నందున, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్‌ను అధికారికంగా కోరనున్నారు. మొత్తానికి తమిళనాట సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన సాంప్రదాయ రాజకీయాలను పటాపంచలు చేస్తూ, దళపతి విజయ్ సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని స్పష్టమవుతోంది.