- కొడంగల్ నియోజకవర్గం కాదు
- బంగారు తునకగా మారుస్తా
- నాయీ స్థాయికి కార్యకర్తల శ్రమ, ప్రజల ఆశీర్వాదం
- 2027 నాటికల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ
- కొడంగల్ లో వేంకటేశ్వర స్వామి దేవాలయానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్, మహా : కొడంగల్‌ను కేవలం ఒక నియోజకవర్గంగా కాకుండా, దేశానికే ఆదర్శవంతమైన నందనవనం గా తీర్చిదిద్దుతానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్ లో రూ. 110 కోట్లతో ఖర్చుతో పునర్ నిర్మించనున్న శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. కొడంగల్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు పేదల తిరుపతి గా విరాజిల్లుతోందని రేవంత్ అన్నారు. తిరుమలలో అనుసరించే ఆగమశాస్త్ర సంప్రదాయాల ప్రకారమే ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దివంగత ఆగమశాస్త్ర సలహాదారులు సుందరవరదాచార్యుల గుర్తుగా ఒక విడిది కేంద్రానికి వారి పేరు పెట్టాలని సూచించారు. ఆధ్యాత్మికతతో పాటు నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ప్రకటించారు.
తాను ఈ స్థాయికి రావడానికి కొడంగల్ కార్యకర్తల రక్తమోడ్చిన శ్రమ, ప్రజల ఆశీర్వాదమే కారణమని సీఎం గుర్తుచేసుకున్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ రైతు రుణమాఫీ, సన్నబియ్యం, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరుస్తున్నామన్నారు. ఒకప్పుడు వలసలకు నిలయమైన కొడంగల్‌లో ఇప్పుడు విద్యా, వైద్య రంగాలు కుదురుకుంటున్నాయని.. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు, సైనిక్ స్కూల్ వంటి సంస్థలతో ఏడాదిన్నరలో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేసి కృష్ణా జలాలను పారించి తీరుతామని స్పష్టం చేశారు. లగచర్ల వద్ద 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమ పనులు ప్రారంభమవుతాయని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఎయిర్‌పోర్టు నుంచి కొడంగల్‌కు భారీ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి..
చిన్న చిన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, నియోజకవర్గ ప్రగతి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సర్పంచ్‌లు ఏ పార్టీ వారైనా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. 2009లో తాను నాటిన మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా మారిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. 2027 డిసెంబర్ లోగా కొడంగల్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసి, ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.








