Mahaa Daily Exclusive

  నేరాల్లో నంబర్ వన్ తెలంగాణ!

Share

నేరాల్లో నంబర్ వన్ తెలంగాణ!
* పడగవిప్పిన క్రైమ్ రేట్.. బెంబేలెత్తుతున్న జనం.
* దేశవ్యాప్తంగా 5.7 శాతం తగ్గిన నేరాలు.
* మన రాష్ట్రంలో ఏకంగా 18.7 శాతం పెరుగుదల.
* దక్షిణాదిలో మహిళలకు అత్యంత ప్రమాదకర రాష్ట్రంగా తెలంగాణ.
* ఎన్సీఆర్బీ సంచలన రిపోర్ట్.
*2024లో ఏకంగా 2.17 లక్షలకు చేరిన క్రిమినల్ కేసులు.
* పోలీసు వ్యవస్థ వైఫల్యంపై తీవ్ర విమర్శలు.
హైదరాబాద్, మహా.
ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. దేశమంతా శాంతిభద్రతల దిశగా పటిష్టమైన అడుగులు వేస్తుంటే, మన రాష్ట్రం మాత్రం క్రైమ్ రేట్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ పాతాళానికి పడిపోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నేరాలు అమాంతం పెరిగిపోవడం సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతోంది. దేశవ్యాప్తంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడితే, తెలంగాణలో మాత్రం అవి కట్టలు తెంచుకోవడం పాలకుల చేతగానితనాన్ని కళ్లకు కడుతోంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన సంచలన గణాంకాలు చూస్తే ఎవరికైనా వణుకు పుట్టక మానదు. మహిళలపై దాడులైనా, సాధారణ నేరాలైనా సరే రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయాయని ఈ రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. నివేదికలోని ఏ ఒక్క లెక్క చూసినా తెలంగాణ భద్రతా వ్యవస్థ ఎంతలా గాడితప్పిందో, ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని స్పష్టమవుతోంది.
**దేశం శాంతిబాటలో.. తెలంగాణ నేరాల బాటలో**
దేశవ్యాప్తంగా ప్రజలకు భద్రత కల్పించడంలో మెరుగైన ఫలితాలు వస్తుంటే, తెలంగాణ మాత్రం పూర్తి విరుద్ధమైన మార్గంలో పయనిస్తోంది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం భారతదేశం వ్యాప్తంగా 2022లో 58,24,946 కేసులు నమోదు కాగా, 2023లో 62,41,569 కేసులు నమోదయ్యాయి. అయితే 2024 వచ్చేసరికి కట్టుదిట్టమైన చర్యల వల్ల దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 58,85,867 కు పడిపోయింది. అంటే జాతీయ స్థాయిలో చూసుకుంటే నేరాల్లో 5.7 శాతం భారీ తగ్గుదల నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. కానీ, సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం నేరాల నమోదులో దేశానికే సవాల్ విసురుతూ, శాంతిభద్రతల వైఫల్యంలో అగ్రభాగాన నిలవడం ఆందోళనకరం.
**రేవంత్ రెడ్డి సర్కార్‌లో జడలువిప్పిన నేర సామ్రాజ్యం**
మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజల ప్రాణ, మానాలకు రక్షణ కల్పించడంలో మాత్రం చతికిలపడింది. రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ ఎప్పుడూ లేని విధంగా పైకి దూసుకుపోతోంది. 2022లో తెలంగాణలో 1,65,830 క్రిమినల్ కేసులు నమోదు కాగా, 2023 నాటికి అవి 1,83,644కు చేరుకున్నాయి. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలోని 2024లో అయితే రికార్డు స్థాయిలో ఏకంగా 2,17,976 కేసులు నమోదై ఉమ్మడి రాష్ట్రాన్ని సైతం బెంబేలెత్తిస్తున్నాయి. దేశమంతా 5.7 శాతం నేరాలు తగ్గితే, తెలంగాణలో మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 18.7 శాతం నేరాలు పెరగడం ప్రభుత్వ పనితీరుకు, పోలీసు యంత్రాంగం నిస్సహాయతకు నిలువుటద్దంగా మారుతోంది.
**దక్షిణాదిలో మహిళలకు అత్యంత అసురక్షిత ప్రాంతం**
మహిళల రక్షణ కోసం బృహత్తర పథకాలు తెస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులకు ఎన్సీఆర్బీ గణాంకాలు చెంపపెట్టు లాంటివి. భారతదేశంలో మహిళలపై నేరాలు 2024లో స్వల్పంగా తగ్గినప్పటికీ, తెలంగాణలో మాత్రం ఆ పదం వినిపించడం లేదు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ మహిళలకు అత్యంత డేంజర్ జోన్‌గా మారిపోయింది. దేశంలో అత్యధిక నేరాలు నమోదయ్యే దక్షిణాది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అప్రతిహతంగా ముందు వరుసలో నిలవడం రాష్ట్ర పరువును బజారున పడేస్తోంది. అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అన్న మాటలు తెలంగాణలో కేవలం పుస్తకాలకే పరిమితం అయ్యాయని ఈ లెక్కలు తేల్చి చెబుతున్నాయి.
**అబలలపై అఘాయిత్యాల్లో సిగ్గుచేటు రికార్డులు**
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి. 2023 సంవత్సరంలో తెలంగాణలో మహిళలపై ఏకంగా 23,678 నేరాలు జరగ్గా, అది ఏమాత్రం కట్టడి కాకపోగా 2024 నాటికి ఈ సంఖ్య ఏకంగా 24,495కు పెరిగిపోయి భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట మహిళల అక్రమ రవాణా, దాడులు, వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. నిఘా వ్యవస్థ, షీ టీమ్స్ లాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదనడానికి ఈ పెరిగిన గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం. మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందన్న విపక్షాల విమర్శలకు ఈ ఎన్సీఆర్బీ డాటా పూర్తి బలాన్ని చేకూరుస్తోంది.
**పొరుగున తగ్గుముఖం.. ఇక్కడ మాత్రం ఉన్మాదం**
తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మహిళా రక్షణలో ముందడుగు వేస్తుంటే మన రాష్ట్రం ఎందుకు వెనుకబడుతుందన్నది అతిపెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌లో 2023లో 22,418 నేరాలు జరగ్గా 2024 నాటికి అవి 19,952కి తగ్గాయి. అలాగే కర్ణాటకలో 20,336 నుంచి 19,945కు పడిపోయాయి. విద్యావంతులు అధికంగా ఉండే కేరళ రాష్ట్రంలో కూడా 2023లో 16,025గా ఉన్న మహిళల పై నేరాలు, 2024 నాటికి 15,037కి తగ్గుముఖం పట్టాయి. ఇలా పొరుగు రాష్ట్రాలన్నీ తమ పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపరుచుకుని నేరాలను నియంత్రిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులు కట్టుకుని కూర్చుందన్న తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
**తమిళనాట స్వల్ప పెరుగుదల.. మన దగ్గర దారుణం**
దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మినహాయిస్తే కేవలం తమిళనాడులో మాత్రమే నేరాలు స్వల్పంగా పెరిగాయి. అక్కడ 2023లో మహిళలపై 8,943 కేసులు నమోదు కాగా, 2024 నాటికి అవి 11,363కి పెరిగాయి. అయితే, పెరిగిన ఆ తమిళనాడు గణాంకాలతో పోల్చినా సరే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అంటే దక్షిణ భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో నేరగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారని, చట్టాలంటే వారిలో ఎలాంటి భయం లేదని ఈ గణంకాలు రూఢీ చేస్తున్నాయి.
**జాతీయ సగటును దాటేసిన క్రైమ్ రేట్.. భద్రత కరువు**
జనాభాకు, పోలీసులకు మధ్య ఉండాల్సిన సమన్వయం రాష్ట్రంలో పూర్తిగా లోపించింది. 2024 అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 383.2 లక్షలు కాగా, ప్రతి లక్ష జనాభాకు జరిగే నేరాల రేటు (Rate of Cognizable Crimes) భయపెట్టే స్థాయిలో ఉంది. జాతీయ స్థాయిలో ఈ క్రైమ్ రేట్ సగటు 418.9 గా ఉంటే, తెలంగాణలో అది ఏకంగా 568.9 గా నమోదు కావడం రాష్ట్రంలో పతనమైన శాంతిభద్రతలకు నిదర్శనం. జాతీయ సగటు కంటే ఇంత భారీ స్థాయిలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ నమోదు కావడం పాలకుల నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా భద్రతా వలయాన్ని విస్తరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.
**చార్జిషీట్ల నమోదులోనూ ఘోర వైఫల్యం**
కేవలం నేరాలు జరగడమే కాదు, జరిగిన నేరాలకు న్యాయం చేయడంలోనూ, దోషులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయడంలోనూ తెలంగాణ పోలీసు వ్యవస్థ అట్టడుగున నిలిచింది. నేరం జరిగిన తర్వాత చార్జిషీట్ దాఖలు చేయడం అతి ముఖ్యమైన ప్రక్రియ. జాతీయ స్థాయిలో సగటు చార్జిషీటింగ్ రేటు 80.3 శాతంగా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో అది కేవలం 74.2 శాతానికే పరిమితమైపోయింది. అంటే నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంలో యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. నేరస్థులకు శిక్ష పడుతుందన్న నమ్మకం సడలిపోవడం వల్లే రాష్ట్రంలో ఈ స్థాయిలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని, తక్షణం ప్రభుత్వం మేల్కోకపోతే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.