మైనార్టీల విద్యాభివృద్ధికి ‘ఏఐ’ బాట.
* ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు.
*మూసీ తీరాన సర్వమత సౌభ్రాతృత్వం.
* గంగా జమునా తెహ్‌జీబ్‌కు సజీవ సాక్ష్యం.
• ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి, యువత ఉజ్వల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త బాటలు వేస్తోంది. పాతతరం మూస చదువులకు స్వస్తి పలుకుతూ.. మైనార్టీ విద్యార్థులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిష్ణాతులను చేసేలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా మైనార్టీ సంక్షేమ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో పాటు వాటిలో నైపుణ్యాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులకు పెద్దపీట వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం విద్యాభివృద్ధికే పరిమితం కాకుండా.. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ‘గంగా జమునా తెహ్‌జీబ్’కు సజీవ సాక్ష్యంగా నిలిచేలా సర్వమత ప్రార్థనా మందిరాల నిర్మాణం, పాత ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లతో కార్మికులకు ఊరట తదితర బహుముఖ ప్రగతిశీల నిర్ణయాలతో మైనార్టీ సంక్షేమంలో ముఖ్యమంత్రి నవశకానికి శ్రీకారం చుట్టారు.
**ప్రతిభకు పట్టాభిషేకం.. స్ఫూర్తిదాయక సత్కారం**
విద్యా రంగంలో విశేషంగా రాణిస్తున్న ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ తరహాలో ప్రోత్సాహకాలు అందిస్తోందో, సరిగ్గా అదే స్ఫూర్తితో మైనార్టీ విద్యార్థులకు సైతం పూర్తి స్థాయి ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేసేలా.. ఈ సత్కార కార్యక్రమానికి గ్రూప్స్ పరీక్షల్లో ఎంపికైన ఉన్నతాధికారులను, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. వారి విజయగాథల ద్వారా విద్యార్థుల్లో చదువు, క్రీడల పట్ల మరింత స్ఫూర్తిని రగిలించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
**పరిపాలనా పగ్గాల్లో భాగస్వామ్యం**
మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అమలయ్యే పథకాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా క్షేత్రస్థాయికి చేరాలన్న సదుద్దేశంతో సీఎం మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసులకు ఎంపికైన మైనార్టీ అభ్యర్థుల్లో ఆసక్తి ఉన్నవారిని గుర్తించి, వారికి మైనార్టీ సంక్షేమ శాఖలోనే బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఈ శాఖ పరిధిలో చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై యువ అధికారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ద్వారా, పరిపాలనలో ఉత్తమ సేవలు అందించేలా, తమ వర్గాల అభ్యున్నతికి వారు మరింత చిత్తశుద్ధితో కృషి చేసేలా వారిని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
**మత పెద్దలకు సముచిత గౌరవం.. మౌలిక వసతుల కల్పన**
మైనార్టీల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ, వారి కనీస అవసరాలను తీర్చడంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో స్పష్టం చేశారు. మసీదుల్లో నిరంతరం సేవలు అందించే ఇమామ్‌లు, మౌజమ్‌లకు ప్రభుత్వం తరఫున అందించే గౌరవ పారితోషికాలను ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. అలాగే, జిల్లా కేంద్రాలు, మండలాల్లో భూ లభ్యత ఉన్న ప్రాంతాలను వెనువెంటనే గుర్తించి, ఖబరస్తాన్‌ల (స్మశానవాటికలు) ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
**కార్మికుల బతుకుల్లో వెలుగులు.. కాలుష్యానికి చెక్**
సామాన్య ఆటో డ్రైవర్ల ఆర్థిక కష్టాలను దూరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ఆటో కార్మికులకు భరోసా కల్పిస్తూ.. డీజిల్, పెట్రోల్‌తో నడిచే పాత ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్లతో ‘రీట్రోఫిట్టింగ్’ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విధానం ద్వారా పట్టణాల్లో పర్యావరణ కాలుష్యానికి చెక్ పెట్టడంతో పాటు, ఆటో కార్మికులకు ఇంధన ఖర్చుల భారాన్ని పూర్తిగా తగ్గించి వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచవచ్చని ముఖ్యమంత్రి వివరించారు.
**మూసీ తీరాన ‘గంగా జమునా తెహ్‌జీబ్’ సజీవ సాక్ష్యం**
తెలంగాణ గడ్డపై తరతరాలుగా వర్ధిల్లుతున్న హిందూ-ముస్లింల ఐక్యతకు అద్దం పట్టేలా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో అత్యద్భుతమైన నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఒకే విశాల ప్రాంగణంలో గుడి, మసీదు, చర్చి, గురుద్వారాలను పక్కపక్కనే నిర్మించాలని సూచించారు. ఈ కట్టడాలు కేవలం ప్రార్థనా మందిరాలుగానే కాకుండా, ఆయా మతాల సంస్కృతులను, భారతదేశ భిన్నత్వంలో ఏకత్వ విశిష్టతను భావితరాలకు చాటిచెప్పే గొప్ప అధ్యయన కేంద్రాలుగా పరిఢవిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు) మహమ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.








