Mahaa Daily Exclusive

  భారత నూతన సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి..

Share

హైదరాబాద్, మహా.
భారత సాయుధ దళాల తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీడీఎస్‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరించనున్నారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం 2026 మే 30న ముగియనుంది. ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం నూతన త్రివిధ దళాధిపతిగా రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
నాలుగు దశాబ్దాలకు పైగా సైన్యంలో సుదీర్ఘ, విశేష సేవలందించిన అత్యున్నత సైనికాధికారిగా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణికి పేరుంది. ఆయన 2025 సెప్టెంబరు నుంచి జాతీయ భద్రతా మండలి సచివాలయంలో (ఎన్‌ఎస్‌సీఎస్) మిలిటరీ అడ్వైజర్‌గా సేవలందిస్తున్నారు. అంతకుముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా, సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (జీఓసీ-ఇన్-సీ)గా ఆయన దేశ రక్షణ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.
దేశానికి అత్యంత కీలకమైన పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని ఆపరేషనల్ ఫార్మేషన్స్‌కు ఆయన విజయవంతంగా నాయకత్వం వహించారు. సైన్యంలో ఆయన ప్రదర్శించిన అసాధారణ తెగువ, విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకం (పీవీఎస్ఎం), అతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్ఎం), సేవా పతకం (ఎస్ఎం), విశిష్ట సేవా పతకం (వీఎస్ఎం) వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించడంలో, దేశ భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో రాజా సుబ్రమణి అనుభవం విశేషంగా ఉపయోగపడనుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.