విశ్వనగరంగా హైదరాబాద్.
* ట్రాఫిక్ ఫ్రీ సిటీ దిశగా అడుగులు.
* 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ!
• కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్.
• మూసీ నది పునరుజ్జీవంపై కేంద్ర కమిటీ ప్రశంసలు.
• ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్తు సవాళ్లకు దీటుగా, ట్రాఫిక్ రహిత, కాలుష్య రహిత విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో జరిగిన అత్యంత కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తదితర కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరైన ఈ ఉన్నత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ భవిష్యత్ దార్శనికతను సాక్ష్యాధారాలతో, పక్కా ప్రణాళికలతో కళ్లకు కట్టారు. పెరుగుతున్న నగరీకరణ రేటును దృష్టిలో ఉంచుకుని పాత పద్ధతులకు స్వస్తి పలికి, రాబోయే దశాబ్దాల అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టామని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.
హైదరాబాద్ ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్‌ను శాశ్వతంగా పరిష్కరించడానికి కేవలం రోడ్ల విస్తరణే ఏకైక మార్గం కాదని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. నగరవాసులకు సులభతరమైన రవాణా మార్గాలను అందించేందుకు ‘సిగ్నల్ ఫ్రీ’ నగరం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం అత్యంత రద్దీ ఉండే కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల కలయికతో కూడిన వినూత్నమైన త్రీ-లెవల్ రవాణా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి తోడు వాహనదారుల ప్రధాన ఆందోళన అయిన పార్కింగ్ సమస్యను పారద్రోలేందుకు నగరవ్యాప్తంగా ఆధునిక సాంకేతికతతో కూడిన బహుళ అంతస్తుల (మల్టీ లెవెల్) పార్కింగ్ సముదాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా రోడ్ల పైనే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే పరిస్థితి ఇక ముందు హైదరాబాద్ లో ఉండకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.
సమగ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ మాస్టర్ ప్లాన్ విశేషాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని క్యూర్ , ప్యూర్ , రేర్ అనే మూడు అద్భుతమైన ఆర్థిక మండలాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న సుమారు 2,170 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని నెట్-జీరో (కాలుష్య రహిత) సిటీగా, సర్వీస్ సెక్టార్ హబ్‌గా మార్చనున్నారు. ఓఆర్ఆర్ వెలుపల నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని పరిశ్రమలు మరియు తయారీ రంగాలకు (మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్) కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని పూర్తిగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికే అంకితం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రణాళికల ద్వారా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, తెలంగాణ శతాబ్ది ఉత్సవాల నాటికి (2047) 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని నిలపడమే లక్ష్యమని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
నగరంలో కాలుష్య కోరలను కత్తిరించడానికి రవాణా వ్యవస్థలో గ్రీన్ మొబిలిటీని విపరీతంగా ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రణాళికలను ఉన్నతాధికారులు స్టాండింగ్ కమిటీకి వివరించారు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీలో పూర్తిగా ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సులను ప్రవేశపెడుతున్నామని, అంతేకాకుండా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తిరిగే పాత ఆటోలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి వాటిని ఈవీ వాహనాలుగా మారుస్తున్నామని ప్రకటించారు. మరోవైపు దశాబ్దాలుగా కాలుష్య కూపంగా మారిన మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవివరంగా తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను నగర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివృద్ధి చేయబోతున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే ఒక విప్లవాత్మక నిర్ణయమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ అద్భుతమైన విజన్ డాక్యుమెంట్‌ను కమిటీ సభ్యులకు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో మహిళాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో సాధించబోయే లక్ష్యాలను నిర్దేశించింది. ఈ సమగ్ర దార్శనికతను మాగుంట శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలోని కమిటీ ఎంతగానో అభినందించింది.








