Mahaa Daily Exclusive

  బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణే…

Share

* 23వ రాష్ట్రంగా కాషాయ జెండా ఎగురవేస్తాం.
* కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ప్రజలు విసిగిపోయారు.
* అభివృద్ధి కేవలం మోదీతోనే సాధ్యం.
* ప్రధాని సభకు మల్కాజిగిరి నుంచి లక్ష మంది.. వెయ్యి బస్సుల ఏర్పాటు.
* ఎదురుదాడులు, తిట్లు మా సంస్కృతి కాదు.
* బీజేపీ ఒక సంస్కారవంతమైన పార్టీ.
* ఎంపీ ఈటల.
హైదరాబాద్, మహా.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తదుపరి మజిలీ, ప్రధాన టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని గాయత్రి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేపు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విశేషాలను, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను సవివరంగా వెల్లడించారు. భారతదేశాన్ని అస్థిరపరచాలని చూసిన దుష్ట శక్తులను తొక్కిపడేసి, అఖండ భారతావనిని సురక్షితంగా ఉంచుతామని మాట ఇచ్చి, ఆ దిశగా భారీ విజయం సాధించిన తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని ఈటల హర్షం వ్యక్తం చేశారు.

**బీఆర్ఎస్ పని ఖతం..కాంగ్రెస్ పాలనపై విరక్తి**

రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. తెలంగాణలో ఇకపై బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేదని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను వద్దనుకుని ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, కేవలం రెండేళ్లలోనే ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలన్నా, నియంతృత్వ పోకడలు అంతం కావాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా.. అది కేవలం బీజేపీతోనే సాధ్యమనే బలమైన భావన నేడు రాష్ట్ర ప్రజల్లో నాటుకుపోయిందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, రాబోయే రోజుల్లో కమలం వికసించే 23వ రాష్ట్రం తెలంగాణయే అవుతుందని జోస్యం చెప్పారు. అలాగే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

**మల్కాజిగిరి నుంచి లక్ష మంది.. వెయ్యి బస్సులు**

నేడు జరగనున్న ప్రధాని మోదీ సభకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏకంగా లక్ష మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. సభకు వచ్చే ప్రజలకు ఎండ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశామని, వారి రవాణా నిమిత్తం 1000 బస్సులను కూడా పంపిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల ప్రచార సమయంలో మోదీ మల్కాజిగిరికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు చూపిన అపారమైన ప్రేమను ఆయన ఎక్కడా చూడలేదని గుర్తుచేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, కేవలం మోదీ ప్రభావం వల్లే ఎంపీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తనకు 25 వేల ఓట్ల భారీ మెజారిటీ వచ్చిందని వివరించారు. ఇప్పుడు అదే ప్రేమను మోదీ గారికి మళ్లీ చూపించేందుకు మల్కాజిగిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజల ఉత్సాహం చూసి పార్టీ కార్యకర్తల్లోనూ రెట్టింపు ఉత్సాహం నెలకొందని తెలిపారు.

**బీజేపీది సంస్కారవంతమైన రాజకీయం**

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఈటల పలు విజ్ఞప్తులు చేశారు. గత రెండేళ్లుగా తాము ప్రజల కోసం చేస్తున్న పనులను దృష్టిలో ఉంచుకుని, ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైతే తమకు కూడా ఎంతో స్ఫూర్తిగా ఉంటుందన్నారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల వెన్నంటే ఉండి వారిని సభకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. రాజకీయ విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. “వ్యక్తులుగా ఎవరు ఏది మాట్లాడినా, బీజేపీ మాత్రం ఒక సంస్కారవంతమైన పార్టీ. దాడులు చేయడం, ఇతరులను తిట్టడం మా సంస్కృతి కాదు” అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.