Mahaa Daily Exclusive

  ఫ్యూచర్ సిటీపై ఉన్న ప్రేమ రైతులపై ఏదీ?.

Share

ఫ్యూచర్ సిటీపై ఉన్న ప్రేమ రైతులపై ఏదీ?.
* కాంగ్రెస్ పాలనలో కల్లాల్లోనే అన్నదాతల కన్నీళ్లు.
*యూరియాపై బ్యాన్ పెట్టిన ఏకైక చెత్త ప్రభుత్వం కాంగ్రెస్.
* యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనాలి.
* నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా సోయి లేదు.
* మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్.
సిద్దిపేట, మహా.
మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీల పైన ఉన్న ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి నిరీక్షిస్తూ, అకాల వర్షాలతో వడ్ల కుప్పల మీదే రైతులు గుండె ఆగి చనిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస సోయి (స్పృహ) లేదని మండిపడ్డారు. శనివారం సిద్దిపేట నియోజకవర్గం, చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న సన్ ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించారు. గత 40 రోజులుగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరుగు పేరిట జరుగుతున్న దోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
**రివ్యూ లేదు.. పట్టింపు లేదు**
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతాంగం అల్లాడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను గాలికి వదిలేసిందని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరి కోతలు మొదలవుతున్నాయంటే చాలు, సంచులు, లారీలు, నిధులు అన్నీ సిద్ధం చేసి రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే వారని గుర్తుచేశారు. కానీ నేటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. కొనుగోళ్లపై ఏ ఒక్క జిల్లా మంత్రికైనా పట్టింపు ఉందా అని ప్రశ్నించారు. ఎరువులు, విత్తనాలు, కరెంటు, సాగునీరు, రైతుబంధు.. ఇలా అన్నింటిలోనూ కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆఖరికి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా నెలల తరబడి కల్లాల్లోనే నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
**ద్వంద్వ విధానాలు.. దగా పడుతున్న రైతులు**
పొద్దున లేస్తే పంటల మార్పిడి చేయాలని, వరి సాగు తగ్గించాలని చెప్పే రేవంత్ రెడ్డి.. రైతులు ఆసక్తిగా పండించిన సన్ ఫ్లవర్, మక్కలు, శనగలు, జొన్నలు ఎందుకు కొనడం లేదని హరీశ్ రావు నిలదీశారు. చిన్నకోడూరు ప్రాంతంలో ఎకరాకు 9-10 క్వింటాళ్ల సన్ ఫ్లవర్ దిగుబడి వస్తే, కేవలం ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధనలు పెట్టారని, చివరకు అది కూడా కొనడం లేదని మండిపడ్డారు. గత 40 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో కుప్పల కింద చెదలు పట్టి సన్ ఫ్లవర్ పంట పాడవుతోందని, మద్దతు ధర రూ. 7,720 ఉంటే ప్రైవేట్ వ్యాపారులు రూ. 5,000 కే అడుగుతున్నారని తెలిపారు. దీనివల్ల రైతు ఎకరాకు రూ. 27,000 వరకు నష్టపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జొన్నల కొనుగోలును పూర్తిగా నిలిపివేశారని, మక్కలకు 26 క్వింటాళ్ల సీలింగ్ పెట్టి సంచులు మీరే తెచ్చుకోవాలని వేధిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కోటా అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెబుతోందని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిది కాదా అని నిలదీశారు.
**ఉత్తమ్ పచ్చి అబద్ధాలు.. సిద్దిపేట యార్డుకు తాళం**
ఏసీ గదుల్లో కూర్చుని ధాన్యం కొనుగోళ్లు సూపర్ గా జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత అద్భుతంగా కొనుగోళ్లు జరిగితే రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారని, వడ్ల కుప్పల వద్ద ఎందుకు ప్రాణాలు విడుస్తున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్‌కు గత నాలుగు రోజులుగా తాళం వేశారని, లారీలు లేక నిల్వలు పేరుకుపోయాయని, కనీసం లారీలు సమకూర్చలేని చేతగాని ప్రభుత్వం ఇదని విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని నమ్మించి యాసంగి పంటకు మొండిచెయ్యి చూపారని, మరోవైపు బస్తాకు కిలో తరుగు, మిల్లుల్లో కోతల పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒకవైపు సంచుల కోసం, కాంటా కోసం, లారీల కోసం వారాల తరబడి ఎదురుచూస్తూ రైతులు కల్లాల వద్దే అలిసిపోయి, చివరకు దళారులకు అమ్ముకుని అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
**డూప్లికేట్ రైతు బిడ్డవి నువ్వు!**
మాటల్లో మందం డైలాగులు కొట్టే రేవంత్ రెడ్డి అసలైన రైతు బిడ్డ కాదని, డూప్లికేట్ రైతు బిడ్డ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నిజంగా రైతు బిడ్డవైతే రైతులను ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబెట్టవని, పోలీస్ కానిస్టేబుల్ బిడ్డవి కాబట్టే రైతులపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నావని విమర్శించారు. రైతులకు సంచులు సరఫరా చేసే తెలివి లేదు కానీ, ఢిల్లీకి 69 సార్లు వెళ్లి మూటలు మోయడానికి మాత్రం ముఖ్యమంత్రికి సమయం ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ పెట్టిన ఏకైక చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. మిర్చి, కూరగాయలు, ఆయిల్ పామ్ రైతులు యూరియా కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. తక్షణమే వ్యవసాయంపై ఉన్న నిర్లక్ష్యాన్ని వీడాలని, యూరియాపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేయాలని, అలాగే వడ్లతో పాటు సన్ ఫ్లవర్, జొన్నలు, మక్కలు, శనగలను యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందించాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్ రావు డిమాండ్ చేశారు.