Mahaa Daily Exclusive

  మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులను ఇబ్బందు పెట్టదు…

Share

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులను ఇబ్బందు పెట్టదు.
* కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన రశీదులు ఇవ్వాలి.
* హమాలీల కొరత రాకుండా చూడాలి.
* డీసీఎంలు సహా అన్ని వాహనాలను రవాణాకు వినియోగించాలి.
* జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్, మహా.

మొక్కజొన్న,ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం
మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ గోదామును అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

జిల్లాలో స్థానిక హమాలీలను వంద శాతం వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని, ఎక్కడా హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీలు అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తే వారి లైసెన్సులను రద్దు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని ఆదేశించారు. పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎం లను పూర్తి స్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ* రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఇప్పటివరకు 3 వేల 873 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల 68 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్లు హమాలీలు, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఫీడ్‌బ్యాక్ అందేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్న తెలంగాణలోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన బందోబస్తు, విజిలెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాల సూచనలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయని, రాబోయే ఒక నెల అత్యంత కీలకమని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు పాల్గొన్నారు.