Mahaa Daily Exclusive

  ప్రధాని సూచనలపై కాంగ్రెస్ ది వక్రీకరణే….

Share

ప్రధాని సూచనలపై కాంగ్రెస్ ది వక్రీకరణే.
• ఆనాడు నెహ్రూ, ఇందిర చేసింది మర్చిపోయారా?.
• బీజేపీది ‘నేషన్ ఫస్ట్’.. కాంగ్రెస్‌ది ‘పవర్ ఫస్ట్.
• యూపీఏ, ఎన్డీయే పాలనపై చర్చకు సిద్ధమా?.
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు.
హైదరాబాద్, మహా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు చేసిన సూచనలను కాంగ్రెస్ పార్టీ కావాలనే వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రయోజనం, ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు ప్రధాని మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని పాలించిందని, ఆ సమయంలో దేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు దేశ సైనిక సామర్థ్యం పరిమితంగా ఉన్న సమయంలో, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కోరిక మేరకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు భారత సైన్యానికి సహకరించి దేశభక్తిని చాటారని, ఆ సేవలను గుర్తించి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాలని నెహ్రూ స్వయంగా ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించిన విషయాన్ని చరిత్ర మరువలేదన్నారు. దేశం కోసం చనిపోవడమే కాదు, బ్రతికి సేవ చేయడం కూడా దేశభక్తేనని, దేశ ప్రయోజనాల కోసం వ్యక్తిగత త్యాగాలు చేయాలన్న భావనతోనే ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారని ఆయన స్పష్టం చేశారు.
సోలార్ పంపులను వినియోగించడం, ప్రజా రవాణాను వాడటం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం, వోకల్ ఫర్ లోకల్‌కు మద్దతు ఇవ్వడం తప్పు ఎలా అవుతుందని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఈనాటికీ లండన్, అమెరికా, యూరప్ దేశాల్లో హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ప్రధానులు సైతం ప్రజా రవాణానే ఉపయోగిస్తారని, లండన్‌లో ‘ట్యూబ్స్’ పేరుతో అండర్‌గ్రౌండ్ మెట్రోను విస్తృతంగా వాడటం డబ్బు లేక కాదని, కేవలం ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసమేనని వివరించారు. వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఆంధ్రా యూనివర్సిటీలో నెలకు ఒకరోజు వాహనాలు వాడకుండా నడక, సైకిళ్లను ప్రోత్సహించడం, సింగపూర్, జపాన్ దేశాల ప్రధానులు సైకిళ్లపై ప్రయాణించడం పర్యావరణం, ఇంధన పొదుపు చర్యల్లో భాగమేనన్నారు. ప్రధానిని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు తమ గత చరిత్రను పరిశీలించుకోవాలని ఆయన హితవు పలికారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రజలను బియ్యం, రొట్టెల వినియోగం తగ్గించాలని, వారానికోసారి ఉపవాసం ఉండాలని కోరారని, 1949లో విందుల పేరుతో ఆహారం వృథా చేయడం దేశ వ్యతిరేక చర్య అని అన్నారని గుర్తుచేశారు. 1950 స్వాతంత్ర్య దినోత్సవంలో విభజన వల్ల పంట భూములు పాకిస్తాన్‌కు వెళ్లాయని, ఆహారాన్ని పొదుపుగా వాడాలని నెహ్రూ చెప్పారని, 1951లో కొరియా యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని నెహ్రూనే స్వయంగా ప్రకటించారని ఆయన సోదాహరణంగా వివరించారు.
అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రతి సోమవారం భోజనం మానేయాలని పిలుపునిచ్చారని, ఇందిరా గాంధీ హయాంలో ‘టాక్ లెస్ – వర్క్ మోర్’ నినాదం తెచ్చారని రాంచందర్ రావు గుర్తుచేశారు. ఇందిర ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రతిపక్షాలను జైలుకు పంపారని ఆయన విమర్శించారు. 1967లో ఇందిరా గాంధీ విదేశీ మారక నిల్వల దృష్ట్యా బంగారం కొనవద్దని ప్రజలకు పిలుపునిచ్చారని, 1976లో సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో బలవంతపు వాసెక్టమీ ఆపరేషన్లతో కుటుంబ నియంత్రణ అమలు చేసి తీవ్ర విమర్శలపాలయ్యారని గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ సైతం చెట్లకు డబ్బులు కాయవని (Money does not grow on trees) సబ్సిడీలు తగ్గించారని, ఆర్థిక సంక్షోభ సమయంలో బెల్టులు బిగించుకోవాలని (We must tighten our belts) కాంగ్రెస్ నాయకులే చెప్పారని ఎద్దేవా చేశారు. 2013లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా బంగారం కొనడం ఆపాలని కోరినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. ఇప్పుడు ప్రధాని మోదీ దేశ ప్రయోజనం కోసం దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించండి, బంగారం కొనుగోళ్లు తగ్గించండి, ఇంధన పొదుపు పాటించండి అని చెబితే విమర్శించడం దురదృష్టకరమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడిందని రాంచందర్ రావు వివరించారు. దీనివల్ల అమెరికాలో పెట్రోల్ ధరలు 59 శాతం, కెనడాలో 43 శాతం, దక్షిణాఫ్రికాలో 31 శాతం, టర్కీలో 27 శాతం పెరిగినప్పటికీ, భారత్‌లో కేంద్రం ధరలను స్థిరంగా ఉంచిందన్నారు. కేవలం భారత్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, బ్రెజిల్ మాత్రమే ధరలను అదుపులో ఉంచాయని తెలిపారు. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఇంధన రేషనింగ్ విధించి లీటర్ల వారీగా పరిమితులు పెడుతున్నారని, అలాంటి పరిస్థితి భారత్‌కు రాకుండా కేంద్రం ముందుచూపుతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం ఆయిల్ బాండ్ల రూపంలో మోపిన భారీ భారాన్ని మోదీ ప్రభుత్వం భరిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిందన్నారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల మధ్య తేడా గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వివరిస్తూ.. యూపీఏ కాలంలో పన్ను మినహాయింపు కేవలం రూ.2 లక్షలు ఉంటే, ఇప్పుడు రూ.12.75 లక్షలకు పెరిగిందన్నారు. నాటి బ్యాంకుల ఎన్‌పీఏలు 11 శాతం నుంచి నేడు 0.6 శాతానికి తగ్గాయని, మౌలిక వసతుల వ్యయం రూ.1.57 లక్షల కోట్ల నుంచి రూ.44.3 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. సంపద సృష్టి రూ.13 లక్షల కోట్ల నుంచి రూ.320 లక్షల కోట్లకు, విదేశీ మారక నిల్వలు 2014 నాటి 304 బిలియన్ డాలర్ల నుంచి నేడు 655 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నారు. తద్వారా 2014లో ప్రపంచ జీడీపీలో 10వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచిందన్నారు. యూపీఏ అవినీతి కుంభకోణాల నుంచి ఎన్డీఏ పారదర్శక పాలన దిశగా దేశం పయనిస్తోందని, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గి, స్టార్టప్‌లు, ఎగుమతులు భారీగా పెరిగి తయారీ రంగం బలోపేతమై సెన్సెక్స్ దూసుకుపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేసిన సూచనలు బలవంతపు ఆంక్షలు కావని, దేశ ప్రయోజనం కోసం ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సిన సూచనలు మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో పనిచేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ‘పవర్ ఫస్ట్’ రాజకీయాలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. దేశ ప్రయోజనం ముందు రాజకీయాలు ఉండకూడదని, దేశ భవిష్యత్తు కోసం ప్రధాని చేసిన సూచనలను ప్రజలందరూ పాటించాలని రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు.