- నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు
- పేపర్ లీకజీపై సీబీఐ దర్యాప్తు
- 15 మందిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ
- అధికారికంగా ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ
- ఢిల్లీలోని ఎన్ టీఏ ముందు విద్యార్థుల తలిదండ్రుల ఆందోళన
- ప్రభుత్వ అసమర్ధతత అన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, మహా : నీట్ యూజీ 2026 ఎగ్జామ్ రద్దు అయింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఎ) మంగళవారం వెల్లడించింది. పేపర్ లీకేజీ ఆరోపణలతో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఈ నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేసినట్లు ఎన్ టీఏ ప్రకటించింది. పేపర్ లీకేజీపై కొన్ని రోజులనుంచి దుమారం రేగగా, ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
రాజస్తాన్లో మొదలైన వివాదం
రాజస్థాన్లో నీట్ వివాదం చివరికి కొలిక్కి వచ్చింది. దాదాపు 125 ప్రశ్నలు లీకయ్యాయని ఆ క్వశ్చన్స్ ఓ శాంపిల్ పేపర్తో యథాతథంగా మ్యాచ్ కావడంతో వివాదం మొదలైంది. అప్పటి నుండి ఎగ్జామ్ రద్దు అవుతుందని వినిపించింది. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేయడంతో పాటు మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. విద్యార్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అయితే అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. మే 3 న రాసిన పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయనుంది. విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మరాదని కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాల్లో సాధారణ శాంపిల్ పేపర్లో ఉన్న సుమారు 125 ప్రశ్నలు నీట్ పేపర్తో అచ్చుగుద్దినట్లు సరిపోలాయని వివాదం మొదలైంది. ఆ తర్వాత పరీక్ష నిర్వహణ, పేపర్ లీకేజీపై వరుసగా ప్రశ్నలు తలెత్తాయని ఎన్టీఏ తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరీక్షా ప్రక్రియను కొనసాగించలేమని గుర్తించడంతో, ఎన్టీఏ నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేయాలని నిర్ణయించింది.
పారదర్శకతకు కట్టుబడి ఉన్నామన్న ఎన్ టీఏ
ఎన్ టీఏ తన 10 మే 2026 నాటి ప్రెస్ రిలీజ్ తర్వాత ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది. అందులో 8 మే న నీట్ యూజీ 2026కు సంబంధించిన కొన్ని అంశాలను విచారణ కోసం కేంద్ర సంస్థలకు పంపినట్లు పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు, అవకతవకలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరగాలని భావించాం. ఎగ్జామ్ నిబద్ధత, విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ అంశాలపై స్వతంత్ర విచారణ జరిపిస్తామని తెలిపింది. అందుకే, వాస్తవాలను ధృవీకరించడానికి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించింది. జాతీయ స్థాయి పరీక్షలను“ఫెయిర్, సెక్యూర్ అండ్ క్రెడిబుల్” గా నమ్మదగిన రీతిలో నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఎన్ టీఏ పేర్కొంది. దాంతోపాటు ఎగ్జామ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఈ కీలకమైన కేసును దర్యాప్తు చేసి నిజాలను వెలికితీయనుంది.
మండిపడ్డ రాహుల్ గాంధీ
నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు రోజుల కొద్దీ పడ్డ శ్రమను మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ విద్యార్థులకు చెప్పేది ఒక రకంగా ఉంటే చేసేది మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని మండిపడ్డారు. ఎంతో మంది విద్యార్థుల తలితండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం బంగారు నగలను అమ్మి ఆ డబ్బతో వారిని చదివించారని అలాంటి వారి శ్రమ అంతా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఏ ముందు అట్టుడికిన ఆందోళన
నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తూ ఎన్ టీఏ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, తలి దండ్రుల్లో ఒక్కసారిగా ఆక్రోషం పెల్లుబికింది. పరీక్ష రద్దు చేశారన్న విషయం తెలుసుకున్న వెంటనే వేలాది మంది ఎన్ టీఏ కార్యాలయం ముందుకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చేయి దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్ టీఏ కార్యాలయం ముందే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఆందోళనలు మిన్నంటాయి.
లీకేజీ ముఠాకు చెందిన 15 మంది అరెస్టు
నీట్ యూజీ 2026 పరీక్ష పత్రం లీకేజీ సూత్రదారులతో పాటు పాత్ర దారులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాని కేంద్రంగా ముఠా పేపర్ లీక్ చేసినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు 15 మందిని అరస్టు చేశారు. వీరిలో రాజస్థాన్ తో పాటు మహారాష్ట్రకు చెందిన వారు కూడా ఉన్నారు. పరీక్ష 8 వ తేదీన జరుగగా ముఠా రెండవ తేదీనే పేపర్ ను బయటకు తీసుకు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత గెస క్వశ్చన్ పేపర్ తో మార్కెట్ లో చెలాణి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పేపర్ లో మాస్టర్ మైండ్ గా ఉన్న మనీష్ యాదవ్ కీలకుడని, అక్కడి నుంచి హర్యానా,, నాసిక్ తదితర ప్రాంతాలకు పంపినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.







