- హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్
- ఆల్విన్ కాలనీ టూ మియాపూర్
- రూ.530 కోట్లు మంజూరు చేసిన సర్కార్
హైదరాబాద్, మహా : నగరంలో మరో కొత్త ఫ్లైఓవర్‌ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఆల్విన్ కాలనీ నుంచి మియాపూర్ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ.530 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో కూకట్పల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఈ కొత్త ఫ్లైఓవర్‌ను అంజయ్య నగర్ మీదుగా నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 1.8 కిలోమీటర్లు కాగా.. 24 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల మార్గంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.530 కోట్లలో.. కేవలం నిర్మాణ పనుల కోసమే రూ.330 కోట్లు ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.200 కోట్లను నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నష్టపరిహారం కోసం కేటాయించారు. పరిపాలన అనుమతులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు త్వరలోనే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం గాజులరామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు మియాపూర్ లేదా పటాన్చెరు వెళ్లాలంటే బాలానగర్, వై జంక్షన్, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. జగద్గిరిగుట్ట మీదుగా వచ్చే వాహనాలు నేరుగా ఆల్విన్ కాలనీ చేరుకొని అక్కడి నుండి ఫ్లైఓవర్ ద్వారా మియాపూర్‌కు చేరుకోవచ్చు. దీనివల్ల ప్రధాన రహదారిపై రద్దీ తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జేఎన్టీయూ జంక్షన్ల వద్ద ఉండే ట్రాఫిక్ తిప్పలకు ఈ వంతెన చెక్ పెట్టనుంది. జూన్‌లో పనులు ప్రారంభం కానుండగా.. త్వరలోనే నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.








