- జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం
- ఆదిలాబాద్ నుంచి శ్రీకారం
- 21 న జరిగే మంత్రివర్గ సమావేశఁలో విది విధానాలపై చర్చ
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మహా : పేదల సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ‘ఇందిరమ్మ ఇండ్ల పథకం’ రెండో విడతను లాంఛనంగా ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21 వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ. పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇప్పటికే సొంత స్థలాలు ఉండి, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల చివరి నాటికి మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించాలని సూచించారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించిన తర్వాతే లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా సహించేది లేదన్నారు. మల్కాజిగిరిలో నిబంధనలకు విరుద్ధంగా యూఎల్సీ భూముల రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌పై తక్షణ చర్యలకు ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.








