• హైకోర్టుకు చేరిన బండి భగీరథ్ కేసు.
• బండి భగీరథ్‌పై మరిన్ని సెక్షన్లు.
• నేడు స్టేషన్లో విచారణ.
• కేసులో ముఖ్యమంత్రి జోక్యం.
• తప్పు చేస్తే శిక్షించండి… బండి సంజయ్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బండి భగీరథ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ భగీరథ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 14న విచారణ జరగనుంది. అయితే కోర్టు తీర్పు రాకముందే పోలీసులు రంగంలోకి దిగారు. నేటి మధ్యాహ్నం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని భగీరథ్‌కు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన అక్కడ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేశారు.
ఈ కేసులో పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాధితురాలి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు, కేసు తీవ్రతను పెంచుతూ కొత్తగా పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను చేర్చారు. దీంతో ఈ కేసు మరింత సీరియస్‌గా మారింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేరుగా జోక్యం చేసుకున్నారు. పోలీసు అధికారులతో మాట్లాడి, విచారణలో ఎలాంటి అశ్రద్ధ చూపవద్దని, పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, బాధితురాలికి న్యాయం చేస్తామని చెబుతున్నారు.
ఇక తన కొడుకుపై జరుగుతున్న ఈ పరిణామాల పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంతో బాధతో స్పందించారు. ఒక తండ్రిగా తన మనసు విలవిల్లాడుతోందని, కానీ తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు. తన కొడుకు తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షించవచ్చని, తాను ఎవరినీ వెనకేసుకురానని స్పష్టం చేశారు. అయితే తన కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న రాజకీయ ప్రత్యర్థులపై ఆయన మండిపడ్డారు. కుట్రలు చేసేవారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని భగీరథ్ కూడా ఎదురు కేసు పెట్టారు. రెండు వైపులా కేసులు ఉండటంతో పోలీసులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రేపు పోలీస్ విచారణలో ఏం తేలుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది రాజకీయంగా కూడా పెద్ద యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.








