ఎర్రవెల్లి వేదికగా కేసీఆర్ ‘డిజిటల్’ వ్యూహం.
* 71 వేల మందితో గులాబీ హైటెక్ సైన్యం.
* పోలింగ్ బూత్‌కు ఇద్దరు చొప్పున సభ్యత్వ నమోదు.
* ఎన్నికల సంఘానికి దీటుగా డిజిటల్ మెంబర్షిప్.
* 14 మంది ఇంచార్జీలతో ఆరు గంటల కేసీఆర్ సుదీర్ఘ మథనం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరోసారి తనదైన మార్క్ వేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వేదికగా సుమారు ఆరు గంటల పాటు పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సుదీర్ఘ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రకంపనకు నాంది పలికింది. కేవలం సంప్రదాయ రాజకీయాలకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని గులాబీ దళాన్ని మహా రణరంగానికి సంస్థాగతంగా సమాయత్తం చేస్తున్నారు.
**ఎన్నికల సంఘానికి దీటుగా డిజిటల్ అడుగులు**
కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ కూడా అదే స్థాయి సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇకపై కాగితాలకు పరిమితం చేయకుండా, పూర్తిగా డిజిటల్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకుని పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
**71,310 మందితో గులాబీ హైటెక్ సైన్యం**
ఈ బృహత్తర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఒక్కో బూత్‌కు ఇద్దరు చొప్పున ఏకంగా 71,310 మంది కార్యకర్తలతో ఒక మహా ‘డిజిటల్ సైన్యాన్ని’ సిద్ధం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు డిజిటల్ విధానాలపై పార్టీ ప్రధాన కార్యదర్శుల ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణా తరగతులు, అవగాహనా శిబిరాలు నిర్వహించనున్నారు. కేవలం రెండు, మూడు రోజుల్లోనే ప్రతి మండలానికి, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ సమన్వయ కమిటీలను నియమించాలని అధినేత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుండి ఒక సభ్యత్వ సమన్వయకర్తను ప్రత్యేకంగా నియమించనున్నారు.
**ఉద్ధండులకు జిల్లాల పగ్గాలు**
ఈ డిజిటల్ మహా వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల బాధ్యతలను పార్టీలోని అత్యంత సీనియర్ నేతలకు కేసీఆర్ అప్పగించారు. రాజధాని హైదరాబాద్ జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఇవ్వగా, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలను సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. ఉత్తర తెలంగాణలో పట్టు నిలుపుకునేందుకు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని రంగాన దించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తక్కళ్లపల్లి రవీందర్ రావు, జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంచార్జీలుగా వ్యవహరిస్తారు. గిరిజన ప్రాబల్యం ఉన్న ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గులాబీ జెండా ఎగురవేసే బాధ్యతను సత్యవతి రాథోడ్ స్వీకరించారు.
ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలను గ్యాదరి బాలమల్లు పర్యవేక్షించనుండగా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను గంగాధర్ గౌడ్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను నారదాసు లక్ష్మణ్ రావు సమన్వయం చేయనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇంచార్జీగా రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తారు. దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పగ్గాలను మాజీ హోంమంత్రి మహమూద్ అలీకి అప్పగించారు. గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల సమన్వయకర్తగా మెట్టు శ్రీనివాస్, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల బాధ్యుడిగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వ్యవహరించనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముందుకు నడిపించనున్నారు.
ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధండులైన నాయకులను రంగంలోకి దించి, వారి ఆధ్వర్యంలో డిజిటల్ సైన్యాన్ని నడిపించడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో అజేయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్ వేసిన ఈ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.








