Mahaa Daily Exclusive

  సీబీఎస్ఈ మూల్యాంకన వివాదం…

Share

సీబీఎస్ఈ మూల్యాంకన వివాదం.
* చైర్మన్, సెక్రటరీపై కేంద్రం వేటు.
* అవకతవకలు, భద్రతా లోపాలపై కొరడా.
* కొత్త చైర్మన్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం.
ఢిల్లీ, మహా
సీబీఎస్ఈ ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ మూల్యాంకన ప్రక్రియలో తలెత్తిన తీవ్ర వివాదాలు, భద్రతా వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు చేపడుతూ ఉన్నతాధికారులను బదిలీ చేయడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించింది. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, సిస్టమ్‌లో భద్రతా లోపాల నేపథ్యంలో సీబీఎస్ఈ చైర్మన్‌ రాహుల్‌ సింగ్‌, కార్యదర్శి హిమాన్షు గుప్తాలపై కేంద్రం బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖలో అదనపు సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్‌ అధికారి లోఖండే ప్రశాంత్‌ సీతారామ్‌ను సీబీఎస్ఈ కొత్త చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఓ ఎస్ ఎం ప్రక్రియ నిర్వహణ కోసం హైదరాబాద్‌కు చెందిన ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’ సంస్థను ఎంపిక చేసిన విధానం, అందులో జరిగిన నిబంధనల ఉల్లంఘన, పోర్టల్ లోపాలపై లోతైన దర్యాప్తు చేయడానికి కేంద్రం ఉపక్రమించింది. ఇందుకోసం ఎస్. రాధామోహన్‌ నేతృత్వంలో ఒక ఏకసభ్య విచారణ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
మరోవైపు, విద్యార్థుల రీవ్యాల్యూయేషన్‌, రీవెరిఫికేషన్‌ కోసం కేంద్రం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన పోర్టల్‌పై భారీ స్థాయిలో సైబర్ దాడులకు యత్నం జరగడం కలకలం రేపింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే పోర్టల్‌పై 15 లక్షలకు పైగా హిట్స్ రాగా, విలువైన డేటాను తస్కరించేందుకు లక్షకు పైగా అనధికారిక ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్రమత్తమైన అధికారులు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా, విద్యార్థులు తమ లేదా కుటుంబ సభ్యుల ఆధార్‌తో లాగిన్ అయ్యి జూన్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు రీవ్యాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. జవాబు పత్రాల లోపాల పరిశీలనకు రూ.100, పునర్‌మూల్యాంకనం కోసం ఒక్కో ప్రశ్నకు రూ.25 చొప్పున ఫీజుగా నిర్ణయించారు.
ఈ మొత్తం వివాదంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి సార్థక్ సిద్ధాంత్.. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా సంబంధిత స్థాయీ సంఘం ముందు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. సీబీఎస్ఈ టెండర్ల అవకతవకలపై ఆ విద్యార్థి ఏకంగా 7 పేజీల నివేదికతో కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థి లేవనెత్తిన అంశాలపై తీవ్రంగా స్పందించిన పార్లమెంటరీ కమిటీ.. ఈ వ్యవహారంపై తక్షణమే పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా సీబీఎస్ఈ అధికారులను ఆదేశించింది.