సరిహద్దు వివాద పరిష్కారానికి భూభాగ మార్పిడి ప్రతిపాదన?
* చర్చలు కొనసాగుతున్నాయన్న కేంద్రం.
* తుది నిర్ణయం ఇంకా లేదని స్పష్టీకరణ.
ఢిల్లీ, మహా.
మణిపుర్‌లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భారత్-మయన్మార్ సరిహద్దు వివాద పరిష్కారానికి భూభాగ మార్పిడి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దులో ఇంకా గుర్తింపు పూర్తి కాని ప్రాంతాల సమస్యను పరిష్కరించే క్రమంలో ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే భూభాగ మార్పిడిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, భారత్-మయన్మార్ సరిహద్దులో ఇంకా కొన్ని ప్రాంతాల గుర్తింపు పెండింగ్‌లో ఉందని, వాటి పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. సరిహద్దు సమస్యల పరిష్కారంలో భాగంగా పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నప్పటికీ, భూభాగ మార్పిడిపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు.
ఇటీవల వెలువడిన కథనాల ప్రకారం మణిపుర్‌లోని చందేల్ జిల్లా పరిధిలోని ప్రాంతం, మయన్మార్‌లోని కబావ్ లోయ మధ్య సుమారు 1.4 చదరపు మైళ్ల భూభాగ మార్పిడి ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మార్పిడి ద్వారా సరిహద్దు స్తంభాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, మిగిలిన సరిహద్దుకు కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారత్-మయన్మార్ మధ్య మొత్తం 1,643 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండగా, అందులో సుమారు 1,472 కిలోమీటర్ల మేర సరిహద్దు గుర్తింపు పూర్తయింది. ఇంకా 171 కిలోమీటర్ల మేర సరిహద్దు గుర్తింపు పెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వివాదం కొనసాగుతోంది.
అక్రమ చొరబాట్లు, తిరుగుబాటు కార్యకలాపాలు, సరిహద్దు నేరాలను అరికట్టే లక్ష్యంతో మొత్తం భారత్-మయన్మార్ సరిహద్దుకు కంచె నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరిహద్దు గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి భూభాగ మార్పిడి ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రతిపాదనపై మణిపుర్‌లోని పలు పౌర సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర భౌగోళిక సమగ్రతకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ అంగీకరించబోమని హెచ్చరిస్తూ, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.







