Mahaa Daily Exclusive

  పార్లమెంట్ ప్రతిష్టంభనపై చర్చలు…. రాహుల్‌తో రిజిజు భేటీ.. ప్రతిష్టంభన వీడేనా?

Share

 

ఢిల్లీ, మహా.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ హౌస్‌లోని రాహుల్ గాంధీ ఛాంబర్‌లో దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లుపై కేంద్రం కాంగ్రెస్ సహకారాన్ని కోరినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను రాహుల్ గాంధీ తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై సభలో చర్చ జరపాలని, అలాగే జులై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేసే వరకు సభ సజావుగా సాగేందుకు సహకరించే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన అనంతరం కిరణ్ రిజిజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలతో కూడా చర్చలు జరిపే అవకాశమున్నట్లు సమాచారం. పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను వీలైనంత త్వరగా తొలగించి సభను సజావుగా నడిపించేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది.

జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఇప్పటికే 13వ రోజుకు చేరుకున్నప్పటికీ, ప్రతిపక్షాల నిరసనల కారణంగా ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించలేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి రావడం, నినాదాలు చేయడం పార్లమెంట్ గౌరవానికి విరుద్ధమని హితవు పలికారు. అయినప్పటికీ గందరగోళం మధ్యే చర్చలు లేకుండా ఐదు కీలక బిల్లులు ఆమోదం పొందాయి.

ఇదిలా ఉండగా, వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులపై సమగ్ర చర్చ జరగకపోవడంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశముందని పార్లమెంటరీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పార్లమెంట్ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.