Mahaa Daily Exclusive

  అరుణాచలంలో ఘోరం….

Share

అరుణాచలంలో ఘోరం.
* గిరిప్రదక్షిణ మార్గంలో దారుణం.
*ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం.
* భయాందోళనలో భక్తులు.
తిరువణ్ణామలై,మహా.
దక్షిణ కైలాసంగా పేరొందిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం అరుణాచలంలో (తిరువణ్ణామలై) అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. అత్యంత పవిత్రంగా భావించే గిరిప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై కీచకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. భక్తిశ్రద్ధలతో లక్షలాది మంది స్వామివారిని స్మరించుకుంటూ నడిచే దారిలో ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణ చేయడానికి నిత్యం వేలాది మంది, పౌర్ణమి లాంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. అయితే, గిరిప్రదక్షిణ మార్గంలో కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో భద్రతా లోపాలను ఆసరాగా చేసుకున్న దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.
దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన అరుణాచలంలో మహిళలకు రక్షణ కరువవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం భక్తులతో రద్దీగా ఉండే గిరిప్రదక్షిణ మార్గంలో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని, మహిళా భక్తులకు పటిష్టమైన భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో రాత్రి వేళల్లో గిరిప్రదక్షిణ చేసే మహిళా భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.