Mahaa Daily Exclusive

  ఐవీఎఫ్, సరోగసీ ముసుగులో పసిపిల్లల దందా…

Share

ఐవీఎఫ్, సరోగసీ ముసుగులో పసిపిల్లల దందా.
*బాలల అక్రమ వ్యాపారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.
• గజగజలాడిస్తున్న ఎన్‌సీఆర్‌బీ 2024 నివేదిక.
• ఇంకా 1.47 లక్షల మంది పిల్లల అదృశ్యం.
ఢిల్లీ, మహా.
సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వరంలా మారాల్సిన ఐవీఎఫ్ , సరోగసీ కేంద్రాలు.. కొందరు అక్రమార్కుల చేతిలో పసిపిల్లల విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ కేంద్రాల ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న బాలల అక్రమ వ్యాపారంపై భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ ఆందోళనకర పరిణామాలపై తక్షణమే స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది.
**కలవరపెడుతున్న గణాంకాలు..**
తాజాగా విడుదలైన ఎన్‌సీఆర్‌బీ 2024 నివేదిక.. దేశంలో పసికందుల అక్రమ రవాణా (ట్రాఫికింగ్) ఏ స్థాయిలో వేళ్లూనుకుందో కళ్లకు కడుతోంది. ఈ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా కొత్తగా 6,000కి పైగా ట్రాఫికింగ్ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే, కుటుంబాలకు దూరమై తప్పిపోయిన పిల్లల సంఖ్య గతం కంటే ఏకంగా 7.8 శాతం మేర పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. వీటన్నింటికీ మించి.. అదృశ్యమై ఇంకా జాడ తెలియని పిల్లల సంఖ్య 1.47 లక్షలకు పైగా ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
**చట్టాల్లోని లొసుగులతోనే దందా..**
ప్రధానంగా ఆర్టీ , సరోగసీ కేంద్రాల్లో జరుగుతున్న ఈ హేయమైన ట్రాఫికింగ్‌ను అడ్డుకునేందుకు నిర్దిష్టమైన నిబంధనలు లేకపోవడమే మాఫియాకు వరంగా మారుతోంది. ఈ దందాను అరికట్టేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ ) అందుబాటులో లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలంటే తక్షణమే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, పకడ్బందీగా కఠినమైన మార్గదర్శకాలను (గైడ్‌లైన్స్) రూపొందించాలని సర్కారుకు న్యాయస్థానం సూచించింది. గతంలో సంచలనం సృష్టించిన ‘పింకీ’ కేసు తీర్పు అమలు తీరుపై సుప్రీంకోర్టు చేపట్టిన తాజా సమీక్షలోనే ఈ ఆందోళనకర వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఏజెన్సీలు, దళారుల కళ్లుగప్పి పసికందుల ప్రాణాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ముఠాలపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకతను తాజా పరిస్థితులు నొక్కిచెబుతున్నాయి.