దిల్లీలో భారత్-ఇండోనేసియా విదేశాంగ మంత్రుల భేటీ!
* 8వ జాయింట్ కమిషన్ సమావేశానికి జైశంకర్, సుగియోనో సహ-అధ్యక్షత..
* ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం.
ఢిల్లీ, మహా.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రాంతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశ రాజధాని దిల్లీ వేదికగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్, ఇండోనేసియాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా 8వ భారత్-ఇండోనేసియా సంయుక్త (జాయింట్) కమిషన్ సమావేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియోనోలు సంయుక్తంగా సహ-అధ్యక్షత వహించారు. ఇరు దేశాల మధ్య పలు వ్యూహాత్మక రంగాలలో సహకార పరిధిని విస్తరించే లక్ష్యంతో ఈ కీలక ద్వైపాక్షిక చర్చలు సాగాయి.
*విస్తృతమైన అంశాలపై చర్చలు*
ఈ సమావేశంలో రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య మరియు సాంస్కృతిక సహకారం వంటి అనేక కీలక అంశాలపై తాము విస్తృతమైన చర్చలు జరపనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. గతంలో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను తాను కలిసినప్పుడు.. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై ఆయన అందించిన మార్గదర్శకత్వం ఎంతో విలువైనదని కొనియాడారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ప్రబోవో మధ్య జరిగిన ఫలప్రదమైన చర్చలు ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిచ్చాయని గుర్తుచేశారు.
*నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి.. జైశంకర్ స్వాగతం*
“8వ భారత్-ఇండోనేసియా జాయింట్ కమిషన్ సమావేశం కోసం ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియోనోకు, వారి ప్రతినిధి బృందానికి దిల్లీలో స్వాగతం పలకడం సంతోషంగా ఉంది” అని జైశంకర్ వ్యాఖ్యానించారు. గత నెలలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా తామిద్దరం కలుసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. మళ్లీ భారతదేశాన్ని సందర్శించడానికి సమయం కేటాయించినందుకు అభినందనలు తెలిపారు. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ జాయింట్ కమిషన్ సమావేశం జరుగుతోందని, ఈ నాలుగేళ్ల కాలంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో అద్భుతమైన పురోగతిని సాధించాయని హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, 2025 నాటికి భారత్, ఇండోనేసియా దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయని తెలిపారు. అలాగే గతేడాది దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలికే గౌరవం తమకు దక్కిందని జైశంకర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
*మోదీ పర్యటనకు ముందస్తు సన్నాహాలు: సుగియోనో*
ఈ సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగి, మంచి ఫలితాలను ఇస్తుందని తాను బలంగా ఆశిస్తున్నట్లు ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియోనో ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా రాజధాని జకార్తాలో పర్యటించనున్నారని, ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ దిల్లీ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తాము ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. ఈ సమావేశం జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికే ముందస్తు ఏర్పాట్లకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. తమ ప్రతినిధి బృందానికి భారత్ అందించిన ఆప్యాయమైన ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
“గత 2022లో జరిగిన జాయింట్ కమిషన్ సమావేశం నుంచి ఇరు దేశాలు పరస్పర సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడానికి, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను పారదర్శకంగా పరిష్కరించడానికి, అలాగే ప్రభోవో సుబియాంటో భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల అగ్రనాయకుల మధ్య జరిగిన సమావేశ నిర్ణయాలపై తదుపరి చర్యలు తీసుకోవడానికి ఇదొక అత్యంత ముఖ్యమైన వేదిక” అని సుగియోనో స్పష్టం చేశారు. ఈ పర్యటన రెండు దేశాల మైత్రిని మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








