Mahaa Daily Exclusive

  గందరగోళం మధ్య బిల్లుల ఆమోదం…లోక్‌సభను స్తంభింపజేసిన విపక్షం….

Share

ఢిల్లీ, మహా.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఆరోపణలపై విపక్ష సభ్యుల నిరసనలతో లోక్‌సభ మంగళవారం కూడా దద్దరిల్లింది. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు నినాదాలతో నిరసన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, చివరకు మూజువాణి ఓటుతో వాటికి ఆమోదం లభించింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు–2026, అప్రోప్రియేషన్ బిల్లు–2026లను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ప్రభుత్వం మూజువాణి ఓటుకు పెట్టగా రెండు బిల్లులు ఆమోదం పొందాయి. అనంతరం స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష నిరసనలు కొనసాగుతుండగా, మంగళవారంతో సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. అనంతరం సమావేశం తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరోసారి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఈ సమావేశాల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రశ్నోత్తరాల సమయం ఒక్కరోజు కూడా సజావుగా నిర్వహించలేకపోవడం గమనార్హం. వరుసగా కొనసాగుతున్న నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటుండగా, కీలక బిల్లులను మాత్రం ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదింపజేస్తోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన మరింత ముదురుతోంది.