Mahaa Daily Exclusive

  మమతకు మరో దెబ్బ..

Share

  • మమతకు మరో దెబ్బ
  • శివసేన, ఎన్సీపీలాగా.. టీఎంసీ
  • ఎంపీలలో చీలిక.. గుర్తుకు కూడా టెన్షన్

ఢిల్లీ, మహా

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీలో ఆమె ‘ఇండియా’ కూటమి అగ్రనేతలతో అత్యవసర సమావేశంలో పాల్గొన్న రోజే.. అటు లోక్‌సభలో ఆమె సొంత పార్టీకి చెందిన ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. టీఎంసీ పార్టీకి ఉన్న 28 మంది ఎంపీల్లో దాదాపు 20 మంది అధికార ఎన్‌డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తృణమూల్ లోక్‌సభ చీఫ్ విప్ పదవి నుంచి తనను అకస్మాత్తుగా తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తీదార్ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎన్‌డీయే కూటమితోనే సాగాలని తాము బలంగా నమ్ముతున్నట్లు దస్తీదార్ ప్రకటించారు. తమతో పాటు ఉన్న 20 మంది ఎంపీల సంతకాలతో కూడిన మద్దతు లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు త్వరలోనే అందజేస్తామని మీడియాకు వెల్లడించారు. మరో రెబెల్ ఎంపీ షర్మిలా సర్కార్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. తాము పార్లమెంట్‌లో 20 మంది ఎంపీలతో ఒక ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడి ఎన్‌డీయేకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త గ్రూప్‌నకు కకోలి ఘోష్ దస్తీదార్ చీఫ్ విప్‌గా, శతాబ్ది రాయ్ డిప్యూటీ లీడర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిపోయిన తరహాలోనే.. ఇప్పుడు బెంగాల్‌లోనూ అదే సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలోనూ 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి తామే ‘అసలైన తృణమూల్’ అని ప్రకటించుకుంటున్న తరుణంలో.. ఇప్పుడు లోక్‌సభలోనూ మెజారిటీ ఎంపీలు చేజారిపోవడం గమనార్హం.
ఈ రెబెల్ ఎంపీలంతా సోమవారం ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై ఈ తిరుగుబాటు వ్యూహానికి తుది రూపాన్ని ఇచ్చినట్లు సమాచారం. మమతా బెనర్జీ ఢిల్లీలో ఏ ప్రాంతంలో అయితే ఇండియా కూటమి భేటీలో పాల్గొన్నారో.. దానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ రహస్య సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు వీలుగా.. మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఎంపీలను తమవైపు తిప్పుకోవడంలో రెబెల్ నేతలు సఫలమయ్యారు.