మేజర్ల సంబంధం నేరం కాదు.
* ఉద్యోగానికీ అడ్డంకి కాదు.
* పరస్పర అంగీకారంతో జరిగే బంధం చెడు ప్రవర్తన కిందకు రాదు.
*ప్రతీ ప్రేమ వ్యవహారం పెళ్లితోనే ముగియాలనే నియమం లేదు.
* తెలంగాణ పోలీస్ నియామక మండలికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.
ఢిల్లీ, మహా.
పెళ్లి కాని ఇద్దరు వయోజనులు (మేజర్లు) పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ప్రవర్తనగా లేదా నైతిక అపరాధంగా పరిగణించలేమని భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రేమ వ్యవహారంలో నమోదైన ఒక క్రిమినల్ కేసును విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం ఏమాత్రం నిషేధించని వ్యక్తిగత సంబంధాలను ఆధారంగా చేసుకుని ఒక యువకుడి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ఈ కేసులో కింది కోర్టుల తీర్పులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను విచారించిన న్యాయస్థానం.. బాధిత అభ్యర్థికి భారీ ఊరటనిస్తూ, వెంటనే ఆయన నియామక ప్రక్రియను సానుకూలంగా పరిశీలించి పోలీసు ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)ని ఆదేశించింది.
**అసలు వివాదం ఏమిటంటే..**
ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. పిటిషనర్ తన పొరుగింటి యువతితో కొన్నేళ్ల పాటు ప్రేమ సంబంధం కొనసాగించాడు. అయితే ఇద్దరి మధ్య ఉన్న ఆ ఆత్మీయ బంధం తదనంతర కాలంలో వివాహ బంధంగా మారలేదు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సదరు యువతి 2014లో ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పెద్దల సమక్షంలో ఇరువురు పరస్పర అంగీకారంతో రాజీకి వచ్చారు. కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యువతి ఆసక్తి చూపకపోవడంతో, 2015లో లోక్ అదాలత్‌లో ఈ వివాదం అధికారికంగా పరిష్కారమైంది. అయితే, గతంలో అతడిపై కేసు నమోదైన నేపథ్యంలో అది ‘నైతిక అపరాధం’ (మోరల్ టర్పిట్యూడ్) కిందకు వస్తుందని భావించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు.. ఎంపికైన ఆ అభ్యర్థి నియామకాన్ని నిలిపివేసి రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అభ్యర్థి వాదనతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆయన నియామకాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ నియామక అధికారులు అప్పీల్‌కు వెళ్లగా, తుది విచారణ జరిపిన సుప్రీంకోర్టు సైతం అభ్యర్థికి అనుకూలంగానే తీర్పునిచ్చింది.
**ప్రేమించినంత మాత్రాన పెళ్లి జరగాలని లేదు!**
ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం నేటి సమాజంలోని మానవ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రతి ప్రేమ సంబంధం తప్పనిసరిగా వివాహంతోనే ముగియాలనే కచ్చితమైన నియమం ఏదీ లేదని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. కేవలం ఒక ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లలేదనే ఏకైక కారణంతో.. ఒక వ్యక్తి మరొకరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని నిర్ధారించడం అత్యంత అహేతుకమని స్పష్టం చేసింది. ఒక బంధం విఫలమైందంటే అది తప్పనిసరిగా మోసమేనని భావించలేమని పేర్కొంది. ఒకవేళ ఆ సంబంధంలో యువతిపై ఏవైనా బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటే అప్పుడు నియామక సంస్థలు సదరు అభ్యర్థి అర్హత, వ్యక్తిత్వంపై సందేహాలు వ్యక్తం చేయవచ్చని తెలిపింది. కానీ, ప్రస్తుత కేసులో అలాంటి బలవంతపు పరిస్థితులు గానీ, యువతిని భయపెట్టి రాజీకి ఒప్పించినట్లు గానీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
**ఊహాగానాలతో ఒకరి భవిష్యత్తును దెబ్బతీయొద్దు**
భారతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థ మూల సూత్రాలను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. ఒక వ్యక్తిపై మోపబడిన ఆరోపణలు న్యాయస్థానంలో నిరూపితమయ్యే వరకు అతడిని పూర్తి నిర్దోషిగానే పరిగణించాల్సి ఉంటుందని, కేవలం ఫిర్యాదు నమోదైందనే ఒకే ఒక్క కారణంతో దోషిగా ముద్ర వేయలేమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన కేసుల్లో మోసం జరిగిందా లేదా అనే వాస్తవాన్ని సంబంధిత బాధితురాలు మాత్రమే విస్పష్టంగా చెప్పగలదని పేర్కొంది. ఈ వివాదంలో యువతి స్వయంగా కేసును కొనసాగించేందుకు నిరాకరించడం, ఎలాంటి సాక్ష్యాలను సమర్పించకపోవడం, పైగా రాజీకి అంగీకరించడం వంటి కీలక అంశాలను ధర్మాసనం ఉటంకించింది. ఇలాంటి స్పష్టమైన పరిస్థితులు కళ్ళెదుట ఉన్నప్పుడు నియామక అధికారులు తమకు తాముగా ఏవేవో ఊహాగానాలు అల్లుకుని ఒక అభ్యర్థి వ్యక్తిత్వంపై చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం ఏమాత్రం సమంజసం కాదని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. పౌరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సున్నితమైన అంశాలను ఎల్లప్పుడూ చట్టపరమైన పరిమితుల్లోనే ఉండి పరిశీలించాలని రిక్రూట్‌మెంట్ బోర్డులకు సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా హితవు పలికింది.








