Mahaa Daily Exclusive

  భూపాలపల్లిలో ఘోరం….

Share

  • భూపాలపల్లిలో ఘోరం
  • వాహనాలు తనిఖీ చేస్తుండగా ఢీకొట్టిన లారీ
  • డీటీఓ వెంకన్న మృతి
  • డీటీవో కార్యాలయం ముందే ఘటన
  • ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వెంకన్న

భూపాలపల్లి, మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అకస్మాత్తుగా వచ్చి ఢీకొనడంతో జిల్లా రవాణా అధికారి వెంకన్న మృతిచెందారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి వెంకన్న తన సిబ్బందితో కలిసి వాహనాలు ఆపి చెక్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బొగ్గు లోడుతో వేగంగా వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి, డ్యూటీలో ఉన్న డీటీఓ వెంకన్నపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. డీటీఓ వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గతంలో ములుగు జిల్లాలో విధులు నిర్వహించి, ఇటీవలే బదిలీపై భూపాలపల్లి జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన వెంకన్న ఊహించని విధంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగించింది.

మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

భూపాలపల్లి డీటీఓ వెంకన్న అకాల మృతి పట్ల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో నిబద్ధతతో విధి నిర్వహణలో ఉంటూ ఇలా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఘటనపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న మృతి పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌ను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఇసుక, బొగ్గు మాఫియాపై ప్రశ్నిస్తే చంపేస్తారా? హరీష్ రావు తీవ్ర ఆగ్రహం

భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి వెంకన్న లారీ ప్రమాదంలో మరణించిన ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే అధికారులను ఇలాగే లారీలతో తొక్కించి చంపిస్తారా? అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక, బొగ్గు మాఫియా వివరాలను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగున్న నిజాన్ని వెలికితీయాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ మరణం వెనుక ఉన్న వాస్తవాలను, కుట్రలను ప్రజల ముందుంచాలని కోరారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, దీనికి కారణమైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.