Mahaa Daily Exclusive

  ఉండవల్లిలో భగ్గుమన్న అమరావతి రైతన్నల ఆగ్రహజ్వాల.

Share

  •  రాజధాని ద్రోహి జగన్.. గో బ్యాక్’ అంటూ హోరెత్తిన నినాదాలు.
  •  వైసీపీ నేతల పర్యటన అడ్డగింపు.. ఇరువర్గాల మధ్య రాళ్లదాడి.
  •  ఉద్రిక్తత మధ్య గాయపడిన కానిస్టేబుల్.. భారీగా మోహరించిన పోలీసులు.

    అమరావతి, మహా.
    అమరావతి రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతల పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శనివారం పెనుమాక సందర్శనకు బయలుదేరిన వైసీపీ నేతల బృందాన్ని రాజధాని రైతులు ఉండవల్లి వద్ద తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. వైసీపీ వాహనాలు ఏమాత్రం ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ రైతులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
    అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరించిన తర్వాతే ఇక్కడ పర్యటించాలని, అసలు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని వైసీపీ నేతలను రైతులు నిలదీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టిన రైతులు.. మావిగన్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది.
    రాజధాని రైతులు, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. అది కాస్తా ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులకు దారితీయడంతో రణరంగాన్ని తలపించింది. ఈ ఘర్షణలను అడ్డుకునే క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసి, చెదురుమదురు గుంపులను చెదరగొట్టారు.
    శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై వైసీపీ శ్రేణులే ఉద్దేశపూర్వకంగా కోడిగుడ్లతో దాడికి దిగాయని రాజధాని రైతులు ఆరోపించారు. వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ఉండవల్లి సెంటర్‌తో పాటు పెనుమాక, కృష్ణాయపాలెం ప్రాంతాల్లో కూడా రైతులు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. అమరావతి సాధన కోసం తమ పోరాటం ఆగేది లేదని రైతులు తెగేసి చెప్పారు. మరోవైపు, ఈ ఘర్షణల వెనుక ఉన్నవారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, రాజధాని గ్రామాల్లో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది.