వైసీపీతో వ్యక్తిగత శత్రుత్వం లేదు.
- విధానాలను ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా?.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
- సంక్షేమంతో పాటు మౌలిక వసతులు ఉంటేనే ఓట్లు.. వైసీపీనే దానికి నిదర్శనం.
- పార్టీని భుజాన మోసే కార్యకర్తలే ‘సాధక్’లు.. పదవుల ఎంపిక వారిదే.
- జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో పవన్ దిశానిర్దేశం.
అమరావతి, మహా.
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని, అయితే వారి తప్పుడు విధివిధానాలను ప్రశ్నిస్తే మాత్రం తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శనివారం అమరావతిలో జనసేన ‘నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ’ కార్యాచరణ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పవన్ పార్టీ శ్రేణులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఎంత తిట్టినా మా ఎదుగుదల ఖాయం
రాజకీయాల్లో మెత్తగా ఉండాలి కానీ, మరీ మౌనంగా ఉంటే దానిని చేతకానితనంగా భావిస్తారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల జనసేన నేత పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను తాను ఏమాత్రం సమర్థించబోనని, అయితే అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా, నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం మర్చిపోయారా అని నిలదీశారు. ఇప్పుడు కూడా వారి తీరు మారలేదని, 11 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పడిపోయినా ఇష్టారాజ్యంగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడితే ప్రశ్నించకూడదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఎంత తిట్టినా జనసేన మరింత బలోపేతం కావడం మాత్రం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
సంక్షేమం పేరుతో మౌలిక వసతులను గాలికొదిలేస్తే ఎలా?
సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదని, అయితే అవి అర్హులైన ప్రతి ఒక్కరికీ నూరు శాతం అందాలన్నదే తమ విధానమని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. కేవలం ఉచితాలు, సంక్షేమ పథకాలతోనే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని, ఇందుకు గత వైసీపీ ప్రభుత్వమే సజీవ నిదర్శనమని ఎద్దేవా చేశారు. పథకాల పేరు చెప్పి ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని, కానీ ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వ్యవస్థలను బలోపేతం చేస్తోందని వివరించారు. కేంద్రం సహకారంతో గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని మౌలిక వసతులు కల్పించాలని, లేకపోతే ఎన్ని ఉచితాలు ఇచ్చినా ప్రజలు హర్షించరని చెప్పారు. ప్రజాప్రతినిధులు ముందుగా ప్రజల అవసరాలను గుర్తించి, బడ్జెట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
నిస్వార్థంగా పనిచేసే వారికే గుర్తింపు.. సాధక్లదే కీలక పాత్ర
పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకువెళ్లే అంకితభావం ఉన్న కార్యకర్తనే ‘సాధక్’ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. 2025 ఆగస్టులో విశాఖలో నిర్వహించిన ‘సేనతో సేన’ కార్యక్రమం ద్వారా భారీగా సభ్యత్వ నమోదు చేపట్టామని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది సభ్యత్వం కోసం ఈ సాధక్‌లు నిరంతరం శ్రమించారని, తమ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని ప్రశంసించారు. ఇలాంటి 18 వేల మంది సాధక్‌లను నాయకత్వ దిశగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పారదర్శకంగా సమాచార సేకరణ జరగాలి
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను, సమాచారాన్ని సేకరించడం వరకే కమిటీల బాధ్యత అని, ఆ నివేదికల ఆధారంగా అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలు ముందుండి పనిచేస్తే, వారికి రక్షణ కవచంగా తాను వెన్నంటే ఉంటానన్నారు. ప్రతి నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేస్తుందని, వారు ఇచ్చే సమాచారం పక్కదారి పట్టకుండా తన కార్యాలయం నుంచి మరో ఐదుగురిని అదనంగా పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం నాయకులను ఎంపిక చేయడం కాదని, పారదర్శకంగా సమాచారాన్ని సేకరించడమేనని స్పష్టం చేశారు. ఎవరెన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారో తెలుసుకున్నాకే వారిని సాధకులుగా నియమించామన్నారు. జనాలతో మమేకమయ్యే వారికే ప్రాధాన్యత ఉంటుందని, పదవుల్లోకి ఎవరు రావాలనేది సాధక్‌లు ఇచ్చే రూల్‌బుక్ నివేదిక ఆధారంగానే నిర్ణయిస్తామని చెప్పారు. ఆ సమాచారంతో పార్టీ ముఖ్య నేతలతో చర్చించి సమష్టిగా బాధ్యతలు అప్పగిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారి కష్టాన్ని కచ్చితంగా గుర్తిస్తామని భరోసా ఇచ్చారు.








