Mahaa Daily Exclusive

  మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి.

Share

• ఢిల్లీలో భారీ మహిళా మహాసభ నిర్వహిద్దాం.
• మహిళల శక్తిని దేశానికి చాటుదాం.. కల్వకుంట్ల కవిత పిలుపు.

హైదరాబాద్,మహా.
చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలులోకి రాకపోవడం దురదృష్టకరమని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా మహిళల ఐక్యశక్తిని ప్రదర్శించేలా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో లక్షలాది మహిళలతో భారీ మహాసభ నిర్వహించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన మహిళా రిజర్వేషన్ల సాధన సభలో మాట్లాడిన కవిత, మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినప్పటికీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శించారు. బిల్లును అమలు చేయకుండా వాయిదా వేయడం ద్వారా మహిళల ఆశలను నిరాశపరిచారని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళల శక్తిని మరోసారి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ మహిళా మహాసభ నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు. అవసరమైతే హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోనూ లక్షలాది మహిళలతో సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళల ఐక్యతే ఈ ఉద్యమానికి బలం కావాలని ఆమె అన్నారు.
రాజకీయాల్లో మహిళలకు నిజమైన సాధికారత రావాలంటే నిర్ణయాత్మక స్థానాల్లో వారికి అవకాశాలు కల్పించాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. మహిళలు ఒక స్థాయి వరకు ఎదిగిన తర్వాత వారిని అడ్డుకునే పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు చట్టబద్ధమైన రిజర్వేషన్లే శాశ్వత పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వెనుక దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలే ప్రధాన కారణమని కవిత గుర్తుచేశారు. జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చామని చెప్పారు. ఆ ఒత్తిడి ఫలితంగానే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిందని, ఇప్పుడు అమలుకోసం మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
దేశ రాజకీయాల్లో మహిళల ఓటు కీలక శక్తిగా మారిందని కవిత పేర్కొన్నారు. మహిళలను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ, మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో మాత్రం స్పష్టత చూపడం లేదని విమర్శించారు. రిజర్వేషన్ అమలు చేయని పార్టీలకు మహిళలు తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
మహిళల కోసం ధైర్యంగా రాజకీయ పార్టీని ప్రారంభించానని, మహిళలందరూ గర్వపడే విధంగా రాజకీయాలు చేస్తానని కవిత హామీ ఇచ్చారు. మహిళా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆగదని ఆమె స్పష్టం చేశారు.