ఆదిలాబాద్ మహా:
వర్షాకాలం నేపథ్యంలో అదిలాబాద్ పట్టణంలోని అత్యంత వరద ప్రభావిత ప్రాంతమైన జీఎస్ ఎస్టేట్ కాలనీని శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సందర్శించారు. 5 లక్షల ప్రత్యేక నిధులతో చేపడుతున్న కాల్వల శుభ్రపరిచే పనులు, జేసీబీ ద్వారా డ్రైనేజీల క్లీనింగ్ కార్యక్రమాన్నిఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బండారి అనుషా సతీష్ మాట్లాడుతూ, అదిలాబాద్ పట్టణంలోని సుమారు ఆరు నుంచి ఏడు వార్డులు వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించబడినట్లు తెలిపారు. మహాలక్ష్మి వాడ, పంజాబ్ చౌక్ నుంచి ప్రవహించే ప్రధాన నాలాలకు అనుసంధానంగా ఉన్న 8 నుంచి 9 కాలనీలను ప్రత్యేకంగా గుర్తించి, వాటిలో కాల్వలు శుభ్రపరిచే పనులు చేపడుతున్నామని తెలిపారు.ఈ పనుల కోసం 5 లక్షల ప్రత్యేక నిధులకు ఆమోదం పొందడంతో పనులు ప్రారంభమయ్యాయని, అలాగే భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో అవసరమైన నిధులు కేటాయించి ప్రధాన నాలాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదిలాబాద్ పట్టణంలో మురుగు కాల్వలు, డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధికి సంబంధించిన పలు పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉండగా, కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ పనులన్నీ పూర్తవడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వరద ప్రభావిత ప్రాంతాల కోసం మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక అధికారుల బృందాలతో ప్రతి కాలనీలో పర్యటించి ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఆదిత్య కండేశ్కర్, ప్రభావతి, రాము, మున్సిపల్ అధికారులు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








