• కల్వకుంట్ల ఫ్యామిలీది వందేళ్ల విధ్వంసం.. బావబామ్మర్దులు తోడేళ్లలా పడ్డారు.
• బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా?
• ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తినే సన్నబియ్యమే నా పేదోళ్లూ తింటున్నారు.
• నల్లగొండ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు.
• నల్లగొండలో రూ.13వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.
నల్గొండ, మహా.
భారత్ రాష్ట్ర సమితి నిఘంటువులో త్యాగం అంటే కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షనేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్, ఎన్జీ కళాశాల మైదానం వేదికగా సుమారు రూ.13 వేల కోట్ల విలువైన హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం.. బహిరంగ సభలో బీఆర్ఎస్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. వందల మంది అమరవీరుల బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను, బీఆర్ఎస్ నేతలు తమ సొంత ఖాతాలో వేసుకోవాలని చూడటం నిస్సిగ్గు చర్య అని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడే విధ్వంసం సృష్టించి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు, తమ ముప్పై నెలల కాంగ్రెస్ ప్రజా పాలనకు మధ్య మేనిఫెస్టోలపై అసెంబ్లీ వేదికగా అడిగినన్ని రోజులు ముఖాముఖి చర్చకు సిద్ధమా అని సంచలన సవాల్ విసిరారు.
నల్లగొండలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనుల జాతర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించి రికార్డు స్థాయి నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో చేపట్టనున్న సుమారు రూ.13 వేల కోట్ల హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కనగల్ వేదికగా హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం.. నల్గొండ కార్పొరేషన్లో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు, రూ.83 కోట్లతో తొలిదశ తాగునీటి శుద్ధి కేంద్రం పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై మాట్లాడారు.
త్యాగం అంటే బీఆర్ఎస్కు ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్
మాట్లాడితే తాము త్యాగాలు చేశామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతల అసలు రంగును సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు. బీఆర్ఎస్ నిఘంటువులో త్యాగం అంటే కేవలం రాజీనామాలు చేయడం, ఎలక్షన్స్ తేవడం, సెలక్షన్లు చూసుకోవడం, చివరికి వేల కోట్లు కలెక్షన్లు చేయడమేనని ఎద్దేవా చేశారు. వందల మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధిస్తే.. ఆ క్రెడిట్ మొత్తాన్ని కేసీఆర్ ఫ్యామిలీ తమ సొంత ఖాతాలో వేసుకుని పదేళ్ల పాటు పదవులు అనుభవించిందని, రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని ధ్వజమెత్తారు.
నిజమైన త్యాగం కొండా లక్ష్మణ్ బాపూజీది, కోమటిరెడ్డిది
త్యాగానికి అసలైన నిర్వచనం చెప్పాలంటే కాంగ్రెస్ నేతలను, ఉద్యమకారులను చూసి నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయన తర్వాత మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి, నల్లగొండ జిల్లా ప్రజలు గర్వపడేలా దీక్ష చేసిన ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని, అది అసలైన త్యాగమని స్పష్టం చేశారు.
అగ్గిపెట్టే రావులవి త్యాగాలు కావు.. హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకుని ప్రాణార్పణ చేసిన శ్రీకాంతా చారి లాంటి ఎందరో అమరవీరుల త్యాగాలను బీఆర్ఎస్ విస్మరించిందని సీఎం మండిపడ్డారు. ఏ పదవులు ఆశించకుండా ప్రాణాలర్పించిన వారిని కాదని, వంద రూపాయల పెట్రోల్ ఒంటిపై పోసుకుని జేబులో అగ్గిపెట్టే దాచుకున్న ‘అగ్గిపెట్టే రావులవి’ త్యాగాలు కావంటూ పరోక్షంగా హరీశ్ రావుపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అగ్గిపెట్టే తెచ్చుకోని వాళ్లు ఈ రోజు త్యాగాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
బావబామ్మర్దులు తోడేళ్లలా తెలంగాణ మీద పడ్డారు
కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వందేళ్ల విధ్వంసం సృష్టించిన చరిత్ర కల్వకుంట్ల ఫ్యామిలీదేనని కామెంట్ చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బావబామ్మర్దులు ఇద్దరూ తోడేళ్ల లెక్క తెలంగాణ మీద పడ్డారని, రాష్ట్రంపై కడుపులో విషం నింపుకుని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతిని చూసే తెలంగాణ ప్రజలు ఆ కుటుంబాన్ని శాశ్వతంగా బహిష్కరించారని, మళ్లీ వారికి పదవులు ఇచ్చేందుకు ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
కేసీఆర్ తినే సన్నబియ్యమే నా పేదోళ్లూ తింటున్నారు
కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక ఏటా రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తూ నిరుపేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. “నేడు ఫామ్‌హౌస్‌లో కూర్చుని కేసీఆర్ తింటున్న సన్న బియ్యమే.. తెలంగాణలోని తండాల్లో ఉన్న నా పేద ప్రజలు తింటున్నారు” అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏమైనా అనుమానం ఉంటే కేటీఆర్ స్వయంగా తండాలకు వెళ్లి చూసుకోవచ్చని హితవు పలికారు. అలాగే మహిళల కష్టాలు తీరుస్తూ కేవలం రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుంటే కడుపు మంట
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ పేదల ఇళ్ల గురించి పట్టించుకోలేదని, వాళ్లు మాత్రం పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తన పదేళ్ల మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని ఆరోపించారు. తాము ఇప్పుడు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ నాయకుల కడుపు మండుతోందని, అందుకే ఓర్వలేక ఏడుస్తున్నారని మండిపడ్డారు. తమ 30 నెలల కాలంలోనే పేదల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని, కేవలం రైతుల ఖాతాల్లోనే రూ.1.56 లక్షల కోట్లు జమ చేసి అన్నదాతలకు దన్నుగా నిలిచామని వెల్లడించారు.
అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎం సవాల్
పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాలు విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ముప్పై నెలల తమ కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని నిలదీశారు. “స్పీకర్‌కు లేఖ రాయండి.. ఇరు పార్టీల మేనిఫెస్టోలపై అడిగినన్ని రోజులు అసెంబ్లీ వేదికగానే ముఖాముఖి చర్చిద్దాం” అని సవాల్ విసిరారు. మూసీ కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం నిండి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్ఎల్బీసీని పడావ్ పెట్టిన దుర్మార్గులు.. సూర్యాపేట వ్యక్తికీ ఓటమి తప్పదు
నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పదేళ్ల పాటు పడావ్ పెట్టిన దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలేనని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్కు గతమే కానీ భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ప్రజలే ఉప్పుపాతర వేశారని, మళ్లీ అక్కడ మొక్క కూడా మొలవనీయరని అన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్తి (జగదీష్ రెడ్డిని ఉద్దేశించి) మాత్రమే మిగిలాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనను కూడా గెలవనియ్యబోమని సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పూర్తిగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్ఎల్బీసీ , డిండి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.







