Mahaa Daily Exclusive

  పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్ – ఇతరులను నిందించే ముందు ఆత్మపరిశీలన చేసుకోండి!

Share

ఢిల్లీ, మహా.
కరాచీలోని మిలిటరీ స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో భారత్‌పై పాకిస్థాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతరులను వేలెత్తి చూపడం మానేసి, ముందుగా పాకిస్థాన్ తన దేశంలోనే పాతుకుపోయిన ఉగ్రవాద మూకలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఒక విదేశాంగ విధానంగా వాడుకోవడం మానుకోవాలని ఆయన పాక్‌కు హితవు పలికారు.

దాడి ఘటన నేపథ్యం
శనివారం కరాచీలోని సింధ్ రేంజర్స్ మిలిటరీ కాంపౌండ్‌లోకి సాయుధులు వాహనంతో గేటు బద్దలు కొట్టుకుని లోపలకు దూసుకెళ్లారు. గ్రెనేడ్లు, తుపాకులతో విరుచుకుపడిన ఈ ముష్కరుల దాడిలో నలుగురు పాక్ పారా మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 90 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ కమాండోలు ఆరుగురు మిలిటెంట్లను అంతమొందించగా, మరొకరిని బంధించారు.

ఉగ్రసంస్థ బాధ్యత
ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తెహ్రీక్ ఏ తాలిబాన్’కు అనుబంధంగా ఉన్న ‘జమాత్ ఉల్ అహ్రార్’ ప్రకటించింది. పాక్ ప్రభుత్వ భవనాలు, భద్రతా దళాల లక్ష్యంగా గతంలో జరిగిన అనేక దాడుల వెనుక ఈ సంస్థే ఉందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. 2024 అక్టోబర్‌లో కరాచీ ఎయిర్‌పోర్టుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన అత్యంత భయంకరమైన దాడి ఇదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అప్పట్లో జరిగిన ఎయిర్‌పోర్టు దాడిలో ఇద్దరు చైనా ఇంజనీర్లు మరణించిన విషయం తెలిసిందే. తమ దేశంలోనే పెరుగుతున్న ఉగ్రవాదాన్ని నియంత్రించలేక, పాకిస్థాన్ పదేపదే భారత్‌పై నిందలు వేయడంపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Latest