హత్రాస్,మహా.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయోధ్యను ప్రపంచస్థాయి పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతామని అఖిలేశ్ చేసిన ప్రకటనను యోగి తప్పుబడుతూ, ఆయన గత చరిత్రను గుర్తు చేశారు. “రామభక్తులపై కాల్పులు జరిపిన చరిత్ర మీది.. మీరు అయోధ్యను ఏం అభివృద్ధి చేస్తారు?” అంటూ యోగి నిలదీశారు. హత్రాస్‌లో రూ.548 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ విమర్శలు చేశారు.
అయోధ్య అభివృద్ధిపై ఎద్దేవా
ప్రధాని మోదీ నాయకత్వంలో, భక్తుల త్యాగాలతో అయోధ్య నేడు త్రేతాయుగాన్ని తలపించేలా పూర్వ వైభవాన్ని సంతరించుకుందని సీఎం యోగి పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ ఆశ పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణాష్టమి వేడుకలను నిషేధించి, కన్వర్ యాత్రపై ఆంక్షలు విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో నిధులు శ్మశాన వాటికల గోడల నిర్మాణానికే పరిమితం ఉండేవని, కానీ తమ ప్రభుత్వం వాటిని ఆలయాల సుందరీకరణకు మళ్లించిందని యోగి స్పష్టం చేశారు.
మధుర, శ్రీకృష్ణ జన్మభూమిపై సవాల్
కేవలం అయోధ్య గురించి మాట్లాడితే సరిపోదని, అఖిలేశ్ యాదవ్ తన నిజమైన వైఖరిని మధుర, బృందావనం మరియు శ్రీకృష్ణ జన్మభూమి విషయంలోనూ స్పష్టం చేయాలని యోగి డిమాండ్ చేశారు. ఆధ్యాత్మికతపై నిజమైన నమ్మకం ఉంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం పట్ల గౌరవాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. సమాజ్‌వాదీ పార్టీకి మౌల్వీల ముందు మోకరిల్లడం తప్ప అభివృద్ధిపై ఎజెండా లేదని, పుణ్యక్షేత్రాల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని యోగి హెచ్చరించారు.
అభివృద్ధి ఎజెండాపై స్పష్టత
తన ప్రభుత్వం కాశీ, అయోధ్య, మధుర వంటి పవిత్ర క్షేత్రాల్లో యాత్రికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోందని, నిరంతరం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని యోగి తెలిపారు. అఖిలేశ్ యాదవ్ అయోధ్యలో జరిగిన మార్పులను కళ్ళారా చూసేందుకు ఒక్కసారైనా రామ్‌లల్లాను దర్శించుకోవాలని ఆయన సూచించారు. అభివృద్ధిపై దుమ్ము చల్లే రాజకీయాలను విడనాడి, వాస్తవాలను గుర్తించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలకు హితవు పలికారు.







