Mahaa Daily Exclusive

  ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే పిల్లల భవిత – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు.

Share

విజయవాడ, మహా.

నేటి సమాజంలో కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చిన్నారులకు వ్యాక్సిన్ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడకు వచ్చిన తల్లిదండ్రులతో ఆప్యాయంగా ముచ్చటించారు.

పిల్లలను ఆత్మీయంగా ఎత్తుకుని ఆడించిన ముఖ్యమంత్రి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉన్న టీకాలను నిర్ణీత సమయంలోనే తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా నేటి జీవనశైలి, ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. ముఖ్యంగా పిల్లల పెంపకం కేవలం తల్లుల బాధ్యత మాత్రమే కాదని, అందులో తండ్రులు కూడా సమానంగా భాగస్వాములు కావాలని సీఎం స్పష్టం చేశారు.

గత కాలపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని గొప్పతనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. “నాడు ఉమ్మడి కుటుంబాలలో అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో పిల్లలు ఎంతో బాధ్యతాయుతమైన విలువలతో పెరిగేవారు. నేటి పరిస్థితుల్లో పిల్లల పెంపకం భారంగా కాకుండా, ఆనందాన్ని ఇచ్చే సంపదగా చూడాలి” అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలపడాల్సిన అవసరం ఉందని, అది సమాజానికి ఎంతో అవసరమని ఆయన ఆకాంక్షించారు.

మారిన కాలంతో పాటు సంతానం పెంపకంలో తండ్రి బాధ్యత పెరగాలని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలను ప్రోత్సహిస్తోందని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే భావి భారత పౌరులు ఉత్తమ సంస్కారాలతో ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు.

Latest