సిద్దిపేట, మహా.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న తీరును మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. సిద్దిపేటలో ఉపాధ్యాయురాలు వజ్రమ్మ పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 99 రోజుల గడువు ఇస్తామన్న సీఎం మాట నీటిమూట అయ్యింది. ఉద్యోగులు జీవితకాలం దాచుకున్న సొమ్మును ఇవ్వకుండా సర్కార్ దగా చేస్తోంది” అని ఆయన ఆరోపించారు.
ఉద్యోగ, విద్యా వ్యవస్థలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఉద్యోగ సంఘాలను ఏసీబీ, విజిలెన్స్ దాడులతో భయపెట్టడం ఈ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 7 డీఏలు, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారంపై కనీస దృష్టి సారించడం లేదని ఆయన విమర్శించారు. క్యాష్‌లెస్ వైద్యం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులతో అగ్రిమెంట్లు చేసుకోకుండానే, ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం నిధులు వసూలు చేయడం దోపిడీ అని దుయ్యబట్టారు. విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు దాటినా గురుకులాల్లో పిల్లలకు కనీసం పుస్తకాలు, బట్టలు అందజేయలేని చేతకాని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
సిద్దిపేటపై కక్ష సాధింపు
రాజకీయ కక్షతో సిద్దిపేట జిల్లాపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. గతంలో అమలు చేసిన అల్పాహార పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టి, మొదటి విడతలోనే మన జిల్లాను పథకం నుంచి తొలగించడం పైశాచిక చర్య. కేసులు, దాడులతో గెలవాలని చూడటం మూర్ఖత్వం. పనితనంతో ప్రజల మనసు గెలుచుకోవాలి” అని ఆయన హితవు పలికారు.
అదర్శనీయ ఉపాధ్యాయుల సేవలు
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు వజ్రమ్మ దంపతుల సేవలను హరీశ్ రావు కొనియాడారు. ఇమామాబాద్ పాఠశాలలో కేవలం 25 మంది పిల్లలు ఉన్నప్పుడు విధుల్లో చేరిన వజ్రమ్మ, తన అంకితభావంతో పాఠశాల బలాన్ని పెంచిన తీరు అభినందనీయమని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన పెంపకం వల్ల వారి కుమారులు అఖిల్, అంకిత్ గ్రూప్ 1, సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం ఆ కుటుంబానికే కాకుండా సిద్దిపేట జిల్లాకు గర్వకారణమని ఆయన అన్నారు. వజ్రమ్మ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.







