• కడియం నర్సరీల్లో ‘యాసిడ్’ కలకలం.
• త్రాచుపాము కంటే 12 రెట్లు విషం.
• కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వింత పురుగు.
• భయంతో వణికిపోతున్న 50 వేల మంది కూలీలు!
కడియం,మహా.
సస్యశ్యామలమైన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల ప్రాంతం ఇప్పుడు ఓ వింత పురుగు దెబ్బకు వణికిపోతోంది. పచ్చని మొక్కల మధ్య పొంచి ఉన్న ఆ చిన్న కీటకం.. అభాగ్యులైన దినసరి కూలీల పాలిట యమపాశంగా మారుతోంది. చూడటానికి చీమలాగే అమాయకంగా కనిపించే ఆ పురుగు శరీరానికి తగిలితే చాలు.. అక్షరాలా నరకం కనిపిస్తోంది. వర్షాకాలం రావడంతో మొక్కల ఎగుమతుల పనిలో నిమగ్నమైన సుమారు 50 వేల మంది కార్మికులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఒకవేళ ఆ పురుగును పొరపాటున నలిపితే చర్మం కాలిపోవడమే కాకుండా, కంటిచూపు కూడా పోయే ప్రమాదం ఉందన్న వార్తలు ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి
భయపెడుతున్న యాసిడ్ పురుగు
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంక అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కనువిందు చేసే పచ్చని నర్సరీలు. సుమారు మూడు వేల మంది నర్సరీ రైతులు రాత్రింబవళ్లు కష్టపడి ఇక్కడ కోట్లాది మొక్కలను పెంచుతుంటారు. రాజమహేంద్రవరానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం జాతీయ స్థాయిలో మొక్కల పెంపకానికి ఒక అతిపెద్ద కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ పచ్చని సామ్రాజ్యంలో మొక్కల ఏరివేత, మట్టి మార్చడం, కట్టలు కట్టడం, వాహనాల్లో లోడింగ్ చేయడం లాంటి కష్టమైన పనుల కోసం ప్రతిరోజూ సుమారు 50 వేల మంది శ్రామికులు ఇక్కడ తమ చెమటను చిందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే, ఇటీవల కురుస్తున్న చెదురుమదురు వర్షాలతో మొక్కల ఎగుమతులు అమాంతం పెరిగిన వేళ, ఊహించని విధంగా ఒక వింత కీటకం దండెత్తింది. అదే ‘యాసిడ్ పురుగు’. ఇప్పుడు ఈ పురుగు పేరు చెబితేనే కడియం కార్మికులు బెంబేలెత్తిపోతున్నారు. మొక్కల చాటున దాక్కునే ఈ పురుగులు పనుల సమయంలో నేరుగా కార్మికుల శరీరాలపైకి ఎగబాకుతుండటంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
చూడటానికి చాలా చిన్నగా, అచ్చం చీమలాగే పొడవుగా కనిపించే ఈ కీటకాన్ని శాస్త్రీయంగా పెడిరోవ్ బీటిల్స్ అని పిలుస్తారు. కానీ దీనివల్ల కలిగే నష్టం మాత్రం ఏనుగంత. అసలు భయానకమైన విషయం ఏమిటంటే, ఈ పురుగు మనుషులను ఉద్దేశపూర్వకంగా కుట్టదు, కరవదు. కానీ తమ ఒంటిపై ఏదో పాకుతోందన్న కంగారులో చాలామంది కార్మికులు అసంకల్పితంగా చేత్తో ఆ పురుగును నలిపేస్తున్నారు లేదా బలంగా కొడుతున్నారు. సరిగ్గా అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. ఈ పురుగును నలిపిన మరుక్షణం దాని శరీరంలోని తోక భాగం నుంచి ‘పెడిరిన్’ అనే అత్యంత భయంకరమైన విషపదార్థం వెలువడుతుంది. ఈ పెడిరిన్ రసాయనం ఎంత ప్రమాదకరమైనదంటే, అత్యంత క్రూరమైన త్రాచుపాము విషం (కోబ్రా వెనమ్) కంటే ఇది 12 రెట్లు ఎక్కువ విషతుల్యమైనదని వైద్య పరిశోధనలు ఘోషిస్తున్నాయి. ఈ యాసిడ్ లాంటి విషం చర్మానికి తగిలిన వెంటనే కణాల విభజనను తీవ్రంగా అడ్డుకుంటుంది. ఆ క్షణంలో ఎలాంటి నొప్పి అనిపించకపోయినా, 12 నుంచి 36 గంటల వ్యవధిలో చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం, భరించలేని మంట, నీటి బుడగల్లాంటి పొక్కులు ఏర్పడటం మొదలవుతుంది. మడతలు పడే మెడ, మోచేతి భాగాల్లో ఈ విషం తగిలితే, అద్దంలో ప్రతిబింబంలా రెండు వైపులా కిస్సింగ్ గాయాలు (మిర్రర్-ఇమేజ్ లెసియన్స్) ఏర్పడి కార్మికులకు నరకం చూపిస్తున్నాయి.
ఈ పురుగు సృష్టిస్తున్న మరో అత్యంత భయానకమైన ముప్పు కంటి చూపుకు సంబంధించినది. పురుగును చేత్తో నలిపిన తర్వాత, ఆ విషం అంటిన చేతులతో పొరపాటున కళ్ళను రుద్దుకుంటే, క్షణాల్లో కంటిలోని సున్నితమైన పొరలు నాశనమైపోతాయి. ఈ ప్రమాదకర పరిస్థితినే వైద్య పరిభాషలో నైరోబీ-ఐ అని పిలుస్తారు. దీనివల్ల కళ్లు తీవ్రంగా వాచిపోయి, కంటిలోని కార్నియాకు ఇన్‌ఫెక్షన్ సోకి అంధత్వం వస్తుందని, ఒక్కోసారి శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ముప్పు కూడా ఉందని వైద్యులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వైద్యం అందక కడియం పరిసర ప్రాంతాల్లోని పేద కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది కార్మికులు దీనిని సాధారణ అలెర్జీగా లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌గా పొరబడుతున్నారు. డాక్టర్ల దగ్గరకు వెళ్లే స్థోమత లేక, ఆ గాయాలపై నాటు మందులు, ఆకుల పసర్లు, పసుపు లాంటివి రాస్తూ మరింత ప్రమాదంలో పడుతున్నారు. దీనివల్ల చర్మంపై ఏర్పడిన పచ్చి గాయాలకు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు సోకి, ముఖం, మెడ లాంటి భాగాల్లో శాశ్వతంగా నల్లటి మచ్చలు ఏర్పడి వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ భయంతో చాలామంది పనులకు వెళ్లడం మానేయడంతో నర్సరీల నిర్వహణకు సైతం తీవ్ర అంతరాయం కలుగుతోంది.








