అమెరికాలో మనోళ్లకు ఊరట.
* జన్మతః పౌరసత్వంపై సుప్రీం చారిత్రక తీర్పు!
* ట్రంప్ ఆదేశాలకు చెక్.
* పిల్లల పౌరసత్వంపై ఆందోళన అక్కర్లేదన్న అత్యున్నత న్యాయస్థానం.
* హెచ్-1బీ వీసాదారులకు పండగే.
* అమెరికాలో పుడితే పౌరసత్వం ఖాయం.
వాషింగ్టన్ , మహా.
అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిపుణులకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు జన్మతః పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) కల్పించే రాజ్యాంగ హక్కును రద్దు చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలను యూఎస్ సుప్రీంకోర్టు సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ మేరకు చారిత్రక తీర్పును వెలువరిస్తూ, అమెరికా గడ్డపై పుట్టిన వారందరికీ పౌరసత్వం లభిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరిణామంతో హెచ్-1బీ, ఇతర వీసాలపై అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయుల పిల్లల భవిష్యత్తుకు భరోసా లభించినట్లయింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన రెండో దఫా పదవీకాలం చేపట్టిన తొలిరోజే జారీ చేసిన వివాదాస్పద కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కొట్టివేసింది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న తల్లిదండ్రుల పిల్లలకు, అలాగే తాత్కాలిక వీసాలపై వచ్చే పర్యాటకుల పిల్లలకు జన్మతః పౌరసత్వం నిరాకరించాలని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొనగా, తాజా తీర్పుతో ఆ ఆదేశాలు పూర్తిగా రద్దయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం, అమెరికాలో పుట్టిన ఎవరైనా సరే ఆ దేశ పౌరులేనని కోర్టు తన తీర్పులో కుండబద్దలు కొట్టింది. అయితే ఈ తీర్పుతో జస్టిస్‌లు శామ్యూల్ అలిటో, నీల్ గోర్సచ్, క్లారెన్స్ థామస్ విభేదించారు. మరోవైపు ఈ తీర్పుపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. ఇది దేశానికి చాలా చెడ్డ పరిణామం అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమైనది కావడంతో దీనిని మార్చాలంటే కేవలం ఏదో ఒక చట్టం చేస్తే సరిపోదని, ఏకంగా రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భారతీయ సమాజానికి ఎంతో అత్యంత కీలకం కానుంది. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో సుమారు 3.2 మిలియన్ల (32 లక్షలు) మంది చట్టబద్ధమైన పత్రాలు ఉన్న భారతీయులు నివసిస్తుండగా, వీరు మెక్సికన్ల తర్వాత అమెరికాలో రెండో అతిపెద్ద వలస సమాజంగా అవతరించారు. అంతేగాకుండా గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయులు దాదాపు పది లక్షల మందికి పైగా ఉన్నారు. వీరితో పాటు సుమారు 7,25,000 మంది పత్రాలు లేని (అన్‌డాక్యుమెంటెడ్) భారతీయులు కూడా అక్కడ నివసిస్తున్నారు. ఈ తీర్పుతో హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1 వంటి తాత్కాలిక వీసాలపై ఉంటూ గ్రీన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి పిల్లలకు, వారు అమెరికాలో పుడితే సహజంగానే పౌరసత్వం లభిస్తుంది.
ఈ చారిత్రక తీర్పును భారతీయ-అమెరికన్ సమాజం పెద్ద ఎత్తున స్వాగతించింది. ట్రంప్ ఉత్తర్వుల వల్ల భారతీయ, దక్షిణాసియా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయేవని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ అన్నారు. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి పిల్లలు ఇక్కడే పుడతారని, ఈ తీర్పుతో ఆ పిల్లలు అమెరికన్లే అని, వారు ఇక్కడికే చెందినవారని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డ అమెరికా పౌరుడే అనే ప్రాథమిక రాజ్యాంగ సూత్రాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించిందని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి విశ్లేషించారు. రాజ్యాంగ హక్కులను కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులతో మార్చలేరని ఆయన స్పష్టం చేశారు. అలాగే, జన్మతః పౌరసత్వం అనేది వలసదారులకు ‘అమెరికన్ డ్రీమ్’ను సాకారం చేసుకోవడంలో మూలస్తంభం లాంటిదని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) అధ్యక్షుడు ఖండేరావు కండ్ వ్యాఖ్యానించారు.








