రేవంత్ మాటల్లోనే ఓటమి భయం కనిపిస్తోంది.
* రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు.
* ఓటరు నమోదు ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు.
* కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు విమర్శలు.
కరీంనగర్ మహా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోనే ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించిన ఆయన, కాళేశ్వరం నీటిని వినియోగించి వెంటనే పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఓటరు నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కొండ సత్యలక్ష్మి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
కరీంనగర్ గడ్డకు బీఆర్ఎస్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి, కేసీఆర్ ఆమరణ దీక్షకు, తొలి ఉద్యమ ఘట్టాలకు కరీంనగర్ కేంద్రంగా నిలిచిందన్నారు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలిచి పలుమార్లు విజయాలను అందించారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే కరీంనగర్‌కు రైల్వే లైన్, తాగునీటి పథకాలను మంజూరు చేయించారని, అనంతరం ముఖ్యమంత్రిగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన హరీశ్ రావు, అధికారం శాశ్వతం కాదని సీఎం స్వయంగా చెప్పడం ఆయనలోని ఓటమి భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా తనను ప్రజలు కాపాడాలని కోరడం ఆశ్చర్యకరమన్నారు. రైతుబంధు బకాయిలు, రుణమాఫీ, బోనస్, రైతు బీమా వంటి హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
రైతులకు మూడు విడతల రైతుబంధు అందలేదని, యాసంగి బోనస్ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని హరీశ్ రావు విమర్శించారు. రైతు బీమా కింద అర్హులైన కుటుంబాలకు పరిహారం అందలేదని, ఎరువుల కోసం రైతులు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం రైతులను, దేవుడినీ మోసం చేసినట్లేనని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని హరీశ్ రావు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా అదే ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడంతో రైతులు మంచి పంటలు పండించారని చెప్పారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం కన్నెపల్లి మోటార్లను ప్రారంభించడం లేదని విమర్శించారు. వెంటనే మోటార్లు ఆన్ చేసి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎస్సారెస్పీ జలాశయాలకు నీటిని తరలించి రైతుల పంటలను రక్షించాలని డిమాండ్ చేశారు.
ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హరీశ్ రావు సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బూత్ స్థాయి ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామాల నుంచి ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను సేకరించి ఓటు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు. కుటుంబ సభ్యులు విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా నిబంధనల ప్రకారం వారి వివరాలను నమోదు చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండే యువత కూడా ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. జూలై ఇరవై ఐదు చివరి తేదీ కావడంతో ప్రతి కార్యకర్త రోజుకు కొంత సమయం కేటాయించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీకి కళ్లు, చెవులు బూత్ స్థాయి ఏజెంట్లేనని హరీశ్ రావు అన్నారు. రాజకీయాల్లో ఎదగాలంటే బూత్ స్థాయిలో పని చేయడమే తొలి అడుగని పేర్కొన్నారు. గతంలో బూత్ ఏజెంట్లుగా పనిచేసిన వారే నేడు ప్రజాప్రతినిధులుగా ఎదిగారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








