Mahaa Daily Exclusive

  డబుల్ రిటర్న్స్ పేరుతో మోసం ప్ర‌ధాన నిందితుడి అరెస్ట్ రిమాండ్….. ఇలాంటి మోసాల‌ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించిన DSP

Share

Adilabad మ‌హా : డబుల్ రిటర్న్స్ వస్తాయని ఆశ చూపిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన యూనిక్ ఎస్‌ఎంసీఎస్ కంపెనీ ప్రధాన నిర్వాహకుడు కొణతాల చంద్రశేఖర్ ను జైనథ్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.ప‌ట్ట‌ణంలోని పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ స‌మావేశ మందిరంలో ఆయ‌న మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. త‌న ఏజెంట్లు సత్యనారాయణ, బొజ్జ గంగారాం ద్వారా జిల్లాలో డిపాజిట్లు సేకరించగా, హైదరాబాద్ నల్లకుంటకు చెందిన కొణతాల చంద్రశేఖర్ రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.దర్యాప్తులో యూనిక్ ఎస్‌ఎంసీఎస్ కంపెనీ పేరుతో ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి పదేళ్లపాటు డిపాజిట్లు సేకరించి, గడువు ముగిసిన తర్వాత రెట్టింపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. జైనథ్ మండలం బెల్గాం గ్రామానికి చెందిన దండేకర్ ఆనంద్‌రావు ఫిర్యాదు మేరకు జైనథ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు కొణతాల చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు యూనిక్ ఎస్‌ఎంసీఎస్ కంపెనీపై మొత్తం 6 కేసులు నమోదయిన‌ట్టు తెలిపారు. ఈ కేసుల్లో 40 మంది బాధితులు గుర్తించబడగా, సుమారు రూ.19 లక్షల మేర ప్రజలు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంద‌న్నారు..
అధిక లాభాలు, డబుల్ రిటర్న్స్, ఆకర్షణీయ పెట్టుబడి పథకాల పేరుతో డబ్బులు సేకరించే సంస్థలను గుడ్డిగా నమ్మవద్దని, పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థలకు ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధ గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ప్రజలకు సూచించారు. అనుమానాస్పద ఆర్థిక సంస్థలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఇతనిచే మోసపోయిన వారు దగ్గరలో ఉన్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి శ్రావణ్,ఎస్ఐ పి గౌతమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest