Mahaa Daily Exclusive

  కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులపై రైల్వే బోర్డు చైర్మన్ సమీక్ష..

Share

• చర్లపల్లి టెర్మినల్, జనగాం అమృత్ స్టేషన్, ఇరిసెట్‌లో విస్తృత తనిఖీలు.

హైదరాబాద్, మహా .

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు, ఆధునిక రైల్వే తయారీ కేంద్రాల నిర్మాణం, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, స్వదేశీ భద్రతా సాంకేతికత అమలుపై రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్య కార్యనిర్వాహక అధికారి సతీష్ కుమార్ విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే తయారీ కేంద్రం నుంచి చర్లపల్లి టెర్మినల్ వరకు పలు కీలక ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

 

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ వాత్సవ్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రారంభమైన పర్యటనలో అమృత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పునరాభివృద్ధి పనులను సతీష్ కుమార్ పరిశీలించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, స్టేషన్ ఆధునికీకరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

అనంతరం కాజీపేటలో రూ.597.68 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో అత్యాధునిక రోలింగ్ స్టాక్‌లు, తదుపరి తరం రైల్వే కోచ్‌ల తయారీతో పాటు వాటి నిర్వహణ చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులు ప్రాజెక్టు నమూనాను ప్రదర్శిస్తూ మొత్తం తయారీ కేంద్ర నిర్మాణ ప్రణాళిక, విభాగాల పనితీరును వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర నివేదిక సమర్పించారు.

 

తయారీ కేంద్రంలోని ప్రధాన షెడ్, బోగీ షాప్, పెయింట్ షాప్, వీల్ షాప్, టెస్టింగ్ షాప్‌లను పరిశీలించిన రైల్వే బోర్డు చైర్మన్, పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ తయారీ కేంద్రం దేశీయ రైల్వే తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు.

 

కాజీపేట నుంచి చర్లపల్లి వరకు ప్రత్యేక తనిఖీ నిర్వహించిన సతీష్ కుమార్, మార్గమధ్యంలో జనగాం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అమృత్ స్టేషన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

 

చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌లో ట్రాక్‌లు, పాయింట్లు, క్రాసింగ్‌లు, యార్డు అభివృద్ధి, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాక్‌మెన్, గ్యాంగ్‌మెన్‌లతో నేరుగా మాట్లాడి వారి పని విధానం, ఎదురవుతున్న సమస్యలు, భద్రతా చర్యలపై ఆరా తీశారు. సిబ్బంది సంక్షేమం, పనిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

 

పర్యటనలో భాగంగా ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా సందర్శించారు. భారతీయ రైల్వే స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన యాంటీ కొలిజన్ వ్యవస్థ ‘కవచ్’ అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘కవచ్–4.0’ వ్యవస్థ అమలు తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించగా, రైలు భద్రతలో ఈ సాంకేతికత కీలక మైలురాయిగా నిలుస్తుందని సతీష్ కుమార్ పేర్కొన్నారు.

 

అనంతరం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రైల్వే బోర్డు చైర్మన్, జనరల్ మేనేజర్‌తో పాటు ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సేవలు, సరుకు రవాణా, భద్రత, సాంకేతిక ఆధునికీకరణ, ఆర్థిక పనితీరు తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై చర్చించిన సతీష్ కుమార్, దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే అత్యుత్తమ జోన్లలో ఒకటిగా మరింత అభివృద్ధి చెందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

Latest