Mahaa Daily Exclusive

  బిఆర్ఎస్ కమీషన్ల కోసం కాళేశ్వరం కడితే..! మేము పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం..కన్నెపల్లి పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్..

Share

హైదరాబాద్, మహా : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు.

కన్నెపల్లి పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమేనని మంత్రి అన్నారు. “పేదలకు ఇళ్లు కడితే కమీషన్లు రావు… కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు కడితేనే కమీషన్లు వస్తాయనే ఆలోచనతో బీఆర్ఎస్ పాలకులు పేదల గృహాల అవసరాన్ని విస్మరించారు. అందుకే నేడు తెలంగాణ ప్రజలు వారిని అధికారానికి దూరం చేశారు” అని మంత్రి వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, కమీషన్ల కోసమే నిర్మించడం వల్లే నేడు మరమ్మతుల అవసరం వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. “అసలు రిపేరు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అవినీతి, మీ కక్కుర్తే దానికి కారణం కాదా? మీరు నాసిరకం నిర్మాణాలు చేసి కూల్చేసి… ఇప్పుడు వాటిని ప్రభుత్వం బాగు చేయలేదని విమర్శించడం హాస్యాస్పదం” అని మండిపడ్డారు.

కన్నెపల్లిలోకి వెళ్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారి ప్రయత్నాలు ఇక ఫలించవన్నారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను దోచుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్‌కు పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి స్పష్టం చేశారు.

 

ముఖ్యమంత్రి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు సంక్షేమం, మహిళల సాధికారత, ఉపాధి కల్పన వంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందని, కమీషన్ల కోసం కాదు.. ప్రజల కోసం పాలన సాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Latest