- అంతర్జాతీయ పర్యటక కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దడమే లక్ష్యంగా నిర్ణయాలు
- దుర్గం చెరువుకు సరికొత్త సొగసులు, పురానాపూల్ బ్రిడ్జికి మెరుగులు
- యాదగిరిగుట్ట దేవాలయం తరహాలో వీరభద్రస్వామి దేవాలయం
హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక రంగ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త విప్లవాత్మక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. పర్యాటక శాఖపై సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఐకానిక్ దుర్గం చెరువు పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు చారిత్రక తారామతి – బారాదరిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మంజీర, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించి సరికొత్త హంగులు అద్దాలని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రకృతి రమణీయ ప్రాంతం వికారాబాద్ జిల్లాను ఒక మెగా టూరిజం హబ్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి, వీరభద్రస్వామి ఆలయాలను పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్ చేయనున్నారు. యాదాద్రి తరహాలోనే ఈ ఆలయాలకు కూడా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని డెవలప్ చేయనున్నారు. అలాగే అటవీ శాఖ పరిధిలోని క్యూర్ ఏరియా భూములను ఎకో-టూరిజం స్పాట్లుగా మార్చాలని, గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే హైదరాబాద్ నలుమూలలా అధునాతన ఎకో పార్కులను నిర్మించాలని అటవీ, పర్యాటక శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మూడవ నగరంగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా మార్చనున్నారు. ఈ పనులను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. చారిత్రక భాగ్యనగర వారసత్వ సంపదను కాపాడే క్రమంలో భాగంగా.. మూసీ నదిపై ఉన్న పురాతన పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జ్ ను పర్యాటకులను ఆకర్షించేలా సరికొత్త పర్యాటక వేదికగా రీ-డిజైన్ చేయనున్నారు. పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులు, సౌకర్యాలను ఇక్కడ కల్పించనున్నారు. ఈ చారిత్రక వంతెనను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్ ప్రణాళికలను సిద్ధం చేయాలని ట్రాఫిక్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఈ భారీ పర్యాటక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఏడాది డిసెంబర్ 2026 లో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన సన్నాహక పనులను ఇప్పుడే ప్రారంభించాలని, పర్యాటక, అటవీ, మున్సిపల్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. రేవంత్ రెడ్డి మార్క్ ఈ నయా టూరిజం ప్లాన్.. తెలంగాణ ఆదాయాన్ని పెంచడమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.








