Mahaa Daily Exclusive

  సైబర్ నేరాలే అతిపెద్ద సవాలు….

Share

  • సైబర్ నేరాలే అతిపెద్ద సవాలు
  • డీజీపీ సి.వి. ఆనంద్
  • సైబర్ నేరాలను నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు
  • తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై డీజీపీ సమగ్ర సమీక్ష

 

హైదరాబాద్, మహా : సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కొత్త ఆలోచనలు, కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత, డేటా అనలిటిక్స్ వినియోగిస్తూ ముందుకు సాగాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులకు సూచించారు. తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ ల్యాబ్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సెంట్రల్ మానిటరింగ్ యూనిట్, సోషల్ మీడియా యూనిట్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, డిజిటల్ ఫోరెన్సిక్ యూనిట్ తదితర విభాగాలను సందర్శించి వాటి పనితీరు, సాంకేతిక సామర్థ్యాలు, దర్యాప్తు విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని సమీక్షించారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తో పాటు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాల తాజా ధోరణులు, దర్యాప్తు విధానాలు, కృత్రిమ మేధస్సు వినియోగం, బాధితులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై డీజీపీకి వివరించారు. సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గింది. అదే విధంగా సైబర్ ఫిర్యాదులు 91,369కు పరిమితమవడంతో ఫిర్యాదుల్లో కూడా 3 శాతం తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. 2025లో దేశవ్యాప్తంగా నమోదైన 49,620 సైబర్ ఎప్ఐఆర్ లలో తెలంగాణలోనే 21,639 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ ఎఫ్ఐఆర్ లలో 44 శాతం తెలంగాణ నుంచే నమోదయ్యాయి. దీంతో సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అలాగే రూ.75 లక్షలకు పైగా నష్టం కలిగిన కేసుల్లో 78 శాతం, రూ.1 లక్షకు పైగా నష్టం ఉన్న కేసుల్లో 56 శాతం ఎఫ్ఐఆర్ కన్వర్షన్ రేటు నమోదు కావడం రాష్ట్ర పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని అధికారులు వివరించారు.

 

సమీక్ష సమావేశంలో డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట సందర్శించిన ప్రత్యేక విభాగాల్లో ఈగల్ ఒకటని, ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరును పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర భద్రతలో ఈ రెండు విభాగాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కొత్త ఆలోచనలు, కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత, డేటా అనలిటిక్స్ వినియోగిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జాతీయ పనితీరు సూచికల్లో తెలంగాణ మరింత మెరుగైన స్థానం సాధించే అవకాశం ఉందని, అందుకు సాంకేతిక వ్యవస్థలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాల పునర్వ్యవస్థీకరణతో పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక విభాగాల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. అవసరమైతే మానవ వనరులను సమర్థంగా వినియోగించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్న డీజీపీ, ఇప్పుడే వీటిని సమర్థంగా నియంత్రించకపోతే భవిష్యత్‌లో మరింత తీవ్రమైన సమస్యలు, పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

 

తెలంగాణను సాంకేతికత ఆధారిత సైబర్ పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, వేగవంతమైన స్పందన, ప్రజల్లో విస్తృత అవగాహన, సమర్థవంతమైన దర్యాప్తు ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో అగ్రస్థానాన్ని నిలబెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వెంటనే ఫిర్యాదు చేయాలని, ఓటీపీలు, పాస్‌వర్డులు, బ్యాంకు వివరాలు, ఇతర ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దని తెలంగాణ పోలీసులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.