- రైల్వే డబ్లింగ్ భూ సమస్యపై సంయుక్త పరిశీలన
- రైతులకు న్యాయం జరిగేలా చర్యలు- స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
కారేపల్లి, మహా:డోర్నకల్–భద్రాచలం రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టు కు సేకరిస్తున్న భూములపై నెలకొన్న వివాదమై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(భూసేకరణ) ఆధ్వర్యంలో గురువారం రెవిన్యూ, అటవీ, రైల్వే, అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. కోమట్లగూడెం రెవిన్యూ గ్రామ పరిధిలో సర్వే నెం.67 కి చెందిన భూమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా భూమి హద్దులు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ, అటవీ శాఖల నివేదికలు, రికార్డుల ఆధారంగా సమస్యను త్వరితగతిన పరిష్కరించే చర్యలు తీసుకుంటామని భూ నిర్వాసిత రైతులకు హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ, రికార్డులను పూర్తిగా పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం రైల్వే శాఖకు భూమిని ఏ విధంగా బదిలీ చేయాలి, పరిహారం అంశాన్ని ఎలా అమలు చేయాలనే విషయాన్ని6 స్పష్టం చేస్తామని తెలిపారు. పై అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎఫ్ఆర్ఓ వెల్లడించారు. ఈ సందర్భంగా గాదెపాడు సర్పంచ్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, భూ నిర్వాసిత రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఈ సమస్యను వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి,రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో తహసీల్దార్, ఆర్ఐ, జీపీఓ, అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ, డీఆర్ఓ, ఎఫ్బీఓ, రైల్వే శాఖ డీఈ, జేఈ, ఒడ్డుగూడెం, చర్లపల్లి, గాదెపాడు గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు రైతులు పాల్గొన్నారు.








